Reading Time: 2 minutes

ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల వల.. 21 మందికి రూ.44 లక్షల కుచ్చుటోపీ

Caption of Image.

కరీంనగర్: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుని, పలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రధాన నిందితుడిగా గుర్తించిన దుడపాక తిరుపతి.. డేటా ఎంట్రీ ఆపరేటర్, టికెట్ బుకింగ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆమె బంధువుల నుంచి కూడా ఉద్యోగాల పేరుతో సుమారు రూ.8.50 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు.

21 మంది నుంచి రూ.44 లక్షలు వసూలు

పోలీసుల విచారణలో నిందితుడు ఇప్పటివరకు సుమారు 21 మంది నుంచి రూ.44 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఉద్యోగం కోసం డబ్బులు చెల్లించిన వారిని నమ్మించేందుకు నిందితుడు పక్కా ప్రణాళికతో మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

నకిలీ పరీక్షలు.. ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు

ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించిన అభ్యర్థుల నమ్మకాన్ని మరింత పెంచేందుకు నిందితుడు నకిలీ పరీక్షలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఇందుకోసం ప్రశ్నాపత్రాలు, OMR షీట్లు, సర్వీస్ రిజిస్టర్లు, నియామక ఉత్తర్వులు తదితర నకిలీ పత్రాలను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దుడపాక తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలతో పాటు కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరో ఏడుగురు పరారీలో

ఈ మోసం వెనుక మరో ఏడుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు.

ఉద్యోగాల పేరుతో డబ్బులు ఇవ్వొద్దు

ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీసులు ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, ఆఫర్ లెటర్లు, నియామక ఉత్తర్వులను సంబంధిత శాఖల అధికారిక వర్గాల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. ఎవరైనా మధ్యవర్తులు లేదా వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.