Reading Time: 2 minutes

నాకు రూ.20 కోట్లు ఇస్తేనే కోచ్‌గా వస్తా.. మోర్గాన్ దెబ్బకి షాక్లో చెన్నై సూపర్ కింగ్స్!

Caption of Image.

Eoin Morgan CSK Coach: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఇంగ్లాండ్ ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ షాకింగ్ ఆఫర్ ఇచ్చాడు. సీఎస్కే హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాలంటే తనకు ఏకంగా రూ.20 కోట్లు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారనే వార్త బయటకు వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై, గత మూడు సీజన్లలో (2024లో 5వ స్థానం, 2025లో 10వ స్థానం, 2026లో 8వ స్థానం) దారుణంగా నిరాశపరిచింది. జట్టును మళ్లీ గాడిన పెట్టేందుకు కొత్త హెడ్ కోచ్ కోసం మోర్గాన్‌తో సంప్రదింపులు జరపగా, అతను అడిగిన మైండ్ బ్లాకింగ్ రెమ్యూనరేషన్‌కు సీఎస్కే యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

మోర్గాన్ దెబ్బకి ఆలోచనలో పడిన సీఎస్కే: 

ఇంతకాలం సీఎస్కే ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ సీజన్‌కు రూ.4.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు అందుకోగా, బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు తీసుకునేవారు. అసిస్టెంట్ కోచ్‌లు, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లందరి జీతాలు కలిపినా మోర్గాన్ ఒక్కడే అడిగిన రూ.20 కోట్లతో పోలిస్తే సగం కూడా కాకపోవడం విశేషం. మోర్గాన్ అడిగిన భారీ మొత్తం వింటే ఒక పెద్ద క్రికెట్ కోచింగ్ క్యాంప్‌నే ఏర్పాటు చేయవచ్చని సీఎస్కే వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై సీఎస్కే మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడ్డప్పటికీ, ఒప్పందం చేసుకునేందుకు చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ఊడ్చేస్తున్న ఎంఎస్ ధోనీ: 

గత మూడేళ్ల పేలవ ప్రదర్శనను తీవ్రంగా పరిగణించిన ఫ్రాంచైజీ ఐకాన్ ఎంఎస్ ధోనీ, టీమ్ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా మార్చేయాలని ప్లాన్ వేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ రెడ్ బాల్ టీమ్‌కు వెళ్లడంతో బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ హెడ్ కోచ్ అవుతాడని అందరూ భావించారు. కానీ ధోనీ మాత్రం పాత కోచింగ్ సిబ్బంది ఎవరినీ కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. హస్సీతో సహా పాత స్టాఫ్ మొత్తాన్ని పక్కన పెట్టి, సపోర్టింగ్ సిబ్బందిని సరికొత్తగా రీస్టార్ట్ చేయాలని మిస్టర్ తలా గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. 

ALSO READ : వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం..

కోచ్‌గా ఇయాన్ మోర్గాన్ సక్సెస్ అయ్యేనా?: 

ప్లేయర్‌గా 2019 వన్డే వరల్డ్ కప్ గెలిపించి, 2021 ఐపీఎల్‌లో కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చిన ఘనత ఇయాన్ మోర్గాన్‌ది. 2023లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గా రాణిస్తున్న మోర్గాన్‌కు ఒకవేళ సీఎస్కేతో డీల్ కుదిరితే హెడ్ కోచ్‌గా ఇదే తొలి అనుభవం అవుతుంది. సీఎస్కే మేనేజ్‌మెంట్ మోర్గాన్‌ను రేట్ తగ్గించుకోవాలని కోరుతుందా లేక ధోనీ ప్లాన్ ప్రకారం మరో కొత్త కోచ్‌ను వెతుక్కుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2027కి ముందే సీఎస్కే క్యాంప్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు క్రికెట్ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.