
- మూడేళ్లలో ఎల్‌ఐసీకి రూ.4,270 కోట్ల ప్రీమియం చెల్లించామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభమయ్యే లోపు చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. సోమవారం రైతుబీమా పథకంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. త్వరలో ఇందిరమ్మ బీమా పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో అప్పటివరకు రైతుబీమా క్లెయిమ్‌ల పరిష్కారంపై దృష్టి పెడతామని చెప్పారు. ఆగస్టు తర్వాత వచ్చిన క్లెయిమ్‌ల పరిహారాన్ని నేరుగా నామినీల ఖాతాల్లో జమ చేయడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు బీమా భద్రత, ఆర్థిక భరోసా కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
73,626 క్లెయిమ్‌ల పరిష్కారం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుబీమా కింద మొత్తం 76,626 క్లెయిమ్‌లు అందాయని మంత్రి తెలిపారు. ఇందులో 73,626 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు చెప్పారు. మరో 2,587 క్లెయిమ్‌లు వివిధ దశల్లో ఉన్నాయని, అభ్యంతరాలు, ఇతర కారణాలతో 413 క్లెయిమ్‌లను తిరిగి పంపించినట్లు వెల్లడించారు. 2023–-24లో 26,056, 2024–-25లో 26,089, 2025–-26లో 24,481 క్లెయిమ్‌లు వచ్చాయని వివరించారు. ఈ మూడేళ్లలో రైతుబీమా ప్రీమియం కింద ఎల్‌ఐసీకి రూ.4,270 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రైతుల ఎన్‌రోల్‌మెంట్ పెరగడంతో ప్రతి ఏడాది ప్రీమియం చెల్లింపులు తగ్గుతున్నాయని తెలిపారు.
పలు కారణాలతో క్లెయిమ్‌ల నిలిపివేత..
సాంకేతిక సమస్యలు, పోలీసు, కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, అవసరమైన పత్రాలు ఇవ్వకపోవడం, నామినీ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కొన్ని క్లెయిమ్‌లు పరిష్కారం కాలేదని మంత్రి తెలిపారు. రైతు మరణం కేసులో నామినీ నిందితుడిగా ఉన్న సందర్భాల్లోనూ క్లెయిమ్‌లు నిలిచిపోయాయని చెప్పారు. తిరస్కరించిన క్లెయిమ్‌లకు కారణాలను నామినీలు, సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు.