Reading Time: 2 minutes
Telangana Assembly Tension Brs Leaders Cases Ktr Harish Rao

Telangana Assembly Tension: తెలంగాణ శాసనసభ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భద్రతను ధిక్కరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ఘటనపై 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలపై ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు కీలక నాయకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ ఘటనలో భారతీయ న్యాయ సంహిత (BNS)కు చెందిన సెక్షన్లు 121(1), 132, 74, 79, 351, 352, 353 రెడ్‌విత్‌ 3(5) కింద కేసులను నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్‌, విజయుడు, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి వంటి ఇతర ముఖ్య నేతల పేర్లను చేర్చారు.

ఇక, సోమవారం సభ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు కార్డన్‌ను దాటుకుని లోపలికి వెళ్లేందుకు నేతలు ప్రయత్నించడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని నెట్టివేయడం, కాలర్లు పట్టుకోవడం, తీవ్ర దుర్భాషలాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలపై ఈ కేసులు దాఖలయ్యాయి. అలాగే మహిళా పోలీసు సిబ్బందిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ, వారిని అవమానించే రీతిలో ప్రవర్తించారని ఫిర్యాదులో పోలీసులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సేకరించిన వీడియో ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, మీడియా కవరేజ్ విజువల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ కేసులు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‎పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. తాతా మధును నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా.. అసెంబ్లీ స్పీకర్‎పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై సైఫాబాద్ పీఎస్‎లో కేసు నమోదు అయ్యింది. స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ కులంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ ఓఎస్డీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.