Reading Time: 2 minutes

హైదరాబాద్‌లో హాస్టళ్లకు 3 నెలల గడువు.. జనవరి 1 నుంచి తనిఖీలు

Caption of Image.

హైదరాబాద్ నగరంలో హాస్టళ్ల భద్రతపై హైడ్రా (HYDRAA) ప్రత్యేక దృష్టి సారించింది. ప్రమాదకర, అనుమతులు లేని భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హాస్టల్ నిర్వాహకులు, భవన యజమానులతో ప్రత్యేకంగా సమావేశమైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. విద్యార్థుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేసినట్లు సమాచారం.

హాస్టళ్ల నిర్వాహకులకు మూడు నెలల గడువు ఇచ్చిన హైడ్రా.. అనంతరం జనవరి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. మూడు కార్పొరేషన్లతో సమన్వయం చేసుకుంటూ హాస్టళ్లలో భవన నిర్మాణ పటిష్టత, ఫైర్ సేఫ్టీ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించనుంది.

పటిష్టమైన భవనాల్లో, అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాల్లోనే హాస్టళ్లను నిర్వహించాలని హైడ్రా సూచించింది. ప్రమాదకరంగా ఉన్న భవనాల్లో ఇప్పటికే హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లయితే వాటిని వెంటనే సురక్షితమైన భవనాలకు తరలించాలని ఆదేశించింది. భవనం నిర్మాణ పటిష్టతను పరిశీలించిన తర్వాతే హాస్టల్ నిర్వహణకు అనుమతించాలని స్పష్టం చేసింది.

అగ్ని ప్రమాదం వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యార్థులు సులభంగా బయటపడేలా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. తగిన పార్కింగ్ సౌకర్యం కూడా ఉండాలని పేర్కొన్నారు.

అనుమతి లేని భవనాల్లో, కాలపరిమితి దాటిన లేదా నిర్మాణపరంగా బలహీనంగా ఉన్న భవనాల్లో హాస్టళ్ల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది. కూలిపోయే ప్రమాదం ఉన్న భవనాలను అవసరమైతే తొలగిస్తామని స్పష్టం చేసింది.

ఇటీవల గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని హైడ్రా మరింత అప్రమత్తమైంది. అంజయ్యనగర్‌లో ప్రమాదకరంగా ఉన్న ఆరు భవనాలను హైడ్రా తొలగించిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. కేవలం 50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనాల నిర్మాణం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇలాంటి నిర్మాణాల వల్ల పక్కనున్న భవనాల భద్రతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే 2024లో సిద్ధిక్‌నగర్‌లో ఓ భవనం పక్కకు ఒరిగిన ఘటనను కూడా హైడ్రా గుర్తుచేసింది. నగరంలోని పలు హాస్టళ్లపై ఇప్పటికే నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

తక్కువ ఫీజుల కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దని హైడ్రా హాస్టల్ నిర్వాహకులకు సూచించింది. డబ్బు కోసం భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టకూడదని హెచ్చరించింది. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించడమే తమ లక్ష్యమని హైడ్రా స్పష్టం చేసింది.
 

©️ VIL Media Pvt Ltd.