Reading Time: 2 minutes

బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌‌ 

Caption of Image.
  • రాంచందర్‌‌రావు సహా వందలాది మంది అరెస్ట్
  • రీయింబర్స్​మెంట్ విడుదల చేసేవరకు పోరు ఆపబోం
  • రాంచందర్ రావు హెచ్చరిక

 హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌‌ చేస్తూ సోమవారం బీజేపీ, బీజేవైఎం శ్రేణులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దశలవారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అసెంబ్లీ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. పోలీసులు, నేతల మధ్య తోపులాటలు, వాగ్వాదం జరిగింది. ఫీజు బకాయిల కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. పోలీసుల కళ్లుగప్పి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట మొదలైంది. రాంచందర్‌‌రావు నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు పోలీస్ వాహనంపై ఎక్కి నిరసన తెలిపారు.

ఈ సమయంలో పోలీస్ జీపు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పలువురు నేతలకు గాయాలయ్యాయి. రామచందర్‌‌రావుతోపాటు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో అమీర్‌‌పేట మాజీ కార్పొరేటర్ సరళ, జనగామ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్ తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. అరెస్టయిన వారిలో బీజేపీ రాష్ట్ర నేతలు కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎన్‌‌.గౌతమ్‌‌రావు, వీరేందర్ గౌడ్, మీడియా ఇన్‌‌చార్జి ఎన్వీ సుభాష్‌‌, గువ్వల బాల్‌‌రాజు, కొప్పు భాష, విజయలక్ష్మి, ప్రభాగౌడ్, కల్యాణ్, రఘునాథ్ రావు తదితరులు ఉన్నారు.

ఫీజుల కోసం సభలోపల, బయట పోరాటం చేస్తాం:రాంచందర్​రావు

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు విడుదల చేసేవరకు అసెంబ్లీ లోపల, బయట ఆందోళనలు కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, లాఠీ దెబ్బలతో ఉద్యమాలను ఆపలేరని ఆయన హెచ్చరించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఫీజు బకాయిలు, 22ఏ భూ సమస్యలపై చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నాయన్నారు. ఒకరు నల్ల బట్టలు, మరొకరు తెల్ల బట్టలు వేసుకుని డ్రామాలు ఆడుతూ అసెంబ్లీ సమావేశాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.  

©️ VIL Media Pvt Ltd.