
SSC CHSL 2026: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్, 2026 (CHSL) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో సుమారు 2,536 గ్రూప్-C ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ రిక్రూట్‌మెంట్‌లో లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), DEO గ్రేడ్ ‘A’ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 7, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 7న రాత్రి 11 గంటలకు అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
SSC CHSL 2026 నోటిఫికేషన్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన ఫీజును చెల్లించాలి. అక్టోబర్ 8, 2026 రాత్రి 11 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్‌లో తప్పులు ఉంటే అక్టోబర్ 14 నుంచి 16 వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. Tier-I, Tier-II పరీక్షల తేదీలను SSC తర్వాత ప్రకటించనుంది.
పోస్టులు, జీతం:
ఈ నియామకంలో LDC, JSA పోస్టులకు Pay Level-2 వర్తిస్తుంది. వీటి జీతం రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. DEO పోస్టులు Pay Level-4లో ఉంటాయి. వీరికి రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం లభిస్తుంది. ఇక DEO Grade ‘A’ పోస్టులకు Pay Level-5 వర్తించనుంది. ఈ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు జీతం ఉంటుంది.
విద్యార్హత, వయోపరిమితి:
SSC CHSL 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు విషయానికి వస్తే.. 2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. అంటే 1999 ఆగస్టు 2 నుంచి 2008 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, SC, ST, PwBD, ESM కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక Tier-I, Tier-II పరీక్షలు, అవసరమైన చోట స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. Tier-I, Tier-II పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా నిర్వహిస్తారు. దరఖాస్తు ప్రక్రియలో వన్-టైం రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయడం, లైవ్ ఫొటో క్యాప్చర్, సంతకం అప్‌లోడ్, ఫీజు చెల్లింపు, ఫైనల్ సబ్మిషన్ వంటి దశలు ఉంటాయి. అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ లేదా my SSC మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ప్రింట్‌అవుట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన గమనిక: మొత్తం 2,536 ఖాళీలు తాత్కాలిక సంఖ్య మాత్రమే. పోస్టుల వారీగా ఖాళీల తుది వివరాలను SSC అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.