
అతనికి ఒక గిన్నె, రకరకాల మసాలాలు, నాణ్యమైన బియ్యం ఇస్తే చాలు… కొన్ని నిమిషాల తర్వాత, ఒక అద్భుతమైన సువాసన మీ నోటిని ఊరిస్తుంది. ఎందుకంటే, టోక్యోలో అతను తన స్టయిల్లో మీకు ఒక బెస్ట్ టేస్టీ బిర్యానీని వండి వడ్డిస్తాడు. బిర్యానీ ఒసావా’గా ఫెమస్ అయినా ఆయన పేరే తకమాస ఒసావా.
బయోఫ్యూయల్ కంపెనీలో మాజీ ఉద్యోగి అయిన ఒసావా, 2009లో కోయంబత్తూరుకు హాలిడేస్ పై వెళ్లినప్పుడు మొదటిసారి బిర్యానీ తిన్నారు. చిన్నప్పటి నుంచి అన్నం అంటే ఇష్టం ఉన్న ఆయనకు, ఆ రుచి బాగా నచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా బిర్యానీ ఆర్డర్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఆ ప్రేమే ఆయనను 2021లో టోక్యోలో ‘బిర్యానీ ఒసావా’ అనే పేరుతో కేవలం 10 సీట్లు ఉన్న చిన్న రెస్టారెంట్ ప్రారంభించేలా చేసింది.
ఒకే వంటకం ఎందుకు?
జపాన్‌లో ఒక సంప్రదాయం ఉంది. దీన్ని ‘డో’ (ఒక మార్గం) అంటారు. టీ సెరిమనీ, పూల అలంకరణ లేదా సుషీ వంటి వంటకాలు తయారుచేసే చెఫ్‌లు జీవితాంతం కేవలం ఒక్కదాని మీదే ప్రాక్టీస్ చేస్తారు. ఒకే వంటకంతో సంవత్సరాల తరబడి కనెక్ట్ కావడం వల్ల మనిషి సెన్స్, స్కిల్స్ మెరుగుపడతాయని ఒసావా నమ్ముతారు. “నిన్నటి కంటే ఈరోజు ఇంకొంచెం మంచిగా చేయడమే ఇక్కడ సంస్కృతి” అని ఆయన చెబుతారు.
చుట్టుపక్కల ప్రచారం, పెద్దగా పేరు కోరుకోకుండా నిశ్శబ్దంగా, అత్యంత అంకితభావంతో బిర్యానీ వండే సాధారణ వంటవారే తనకు అసలైన గురువులని ఆయన అంటారు. లాహోర్, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీలో పర్యటించి బిర్యానీ రుచులు తెలుసుకున్నారు. ఒకసారి ఢిల్లీలో లోకల్ బిర్యానీ తింటున్నప్పుడు ఎంతగా లీనమయ్యారంటే, చివరికి తన ఫ్లైట్‌ను కూడా మిస్ చేసుకున్నారు.
టోక్యోలో బిర్యానీని పరిచయం చేసినప్పుడు “కూర ఎక్కడ?”, “ఫ్రైడ్ రైస్‌కి దీనికి ఎం తేడా ?” లాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. భారతీయులకు వడ్డించడం అనేది కఠినమైన పరీక్ష లాంటిదని, ఎందుకంటే వారికి బిర్యానీ గురించి అసలైన అవగాహన ఉంటుందని అన్నారు. కస్టమర్లు బిర్యానీని సగం తిని వదిలిస్తే… దాన్ని అతను బిర్యానీ ఇంకా మెరుగ్గా చేయలని భావించి, రుచిని మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు.
ALSO READ : కులం అంతం అయినప్పుడు.. రిజర్వేషన్లు వదులుకుంటాం
హైదరాబాదీ బిర్యానీ ఫెమస్ అయినప్పటికీ, ఆయన ప్రపంచంలోని రకరకాల పద్ధతులను తన వంటలో జోడించారు. కోల్‌కతా మసాలాలు, బాస్మతి బియ్యం వండే విధానం, పాకిస్తానీ గ్రేవీ, బలూచిస్తానీ పద్ధతిలో మాంసం మెత్తగా చేయడం, తమిళనాడు స్టయిల్లో రుచి వంటి బెస్ట్ అంశాలన్నింటినీ కలిపి తన స్టయిల్లో అద్భుతమైన బిర్యానీని తయారు చేస్తారు.
చివరికి, ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా నేర్చుకుంటూ, ఒకే లక్ష్యం కోసం పరిపూర్ణత సాధించే తపన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనే చక్కటి సందేశాన్ని చెఫ్ ఒసావా ప్రయాణం మనకు చెబుతుంది.