
పద్మశ్రీ అవార్డు గ్రహీత, దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న విద్యావేత్త హరేకల హజబ్బకు ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. ఓటర్ల లిస్టులో పేరు తేడాలు ఉన్నాయంటూ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు.
అసలు విషయం ఏంటంటే… కర్ణాటకలో ఓటర్ల లిస్ట్ ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే హరేకల హజబ్బకు ఈసీ నోటీసు వచ్చింది. 2002 నాటి పాత ఓటర్ల లిస్టులో ఆయన పేరు కేవలం ‘హజబ్బ’ అని మాత్రమే ఉంది. కానీ, ఆ తర్వాత వచ్చిన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, కొత్త ఓటర్ ఐడీతో పాటు ఆయన అందుకున్న పద్మశ్రీ అవార్డు పత్రాలన్నింటిలోనూ పూర్తి పేరు ‘హరేకల హజబ్బ’ అని ఉంది. ఈ రెండు పేర్ల మధ్య తేడా ఉండటంతో అధికారులు ఈ నోటీసు పంపారు.
అంగన్‌వాడీ కార్యకర్తలు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి ఈసీ నోటీసును అందజేశారు. తన వాదనను వినిపించడానికి, తగిన సాక్షాలు చూపించడానికి సెప్టెంబర్ 11వ తేదీన గ్రామ పంచాయతీ ముందు హాజరు కావాలని ఆదేశించారు.
►ALSO READ | అసెంబ్లీ నుంచి DMK ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్..
తనవద్ద ఆధార్, పాస్‌పోర్ట్, పద్మశ్రీ అవార్డు పత్రాలు అన్నీ సరిగ్గా ఉన్నాయని, విచారణ సమయంలో వాటిని చూపిస్తే ఈ చిన్న సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. విచారణ జరిగే చోట గ్రామ అకౌంటెంట్ కూడా హాజరు కానున్నారు.
ఎవరు ఈ హరేకల హజబ్బ?:
కర్ణాటకలోని మంగళూరులో వీధులు, బస్ స్టాండ్లలో నారింజ పండ్లు అమ్ముకుంటూ బతికే సాధారణ వ్యక్తి హజబ్బ. తాను పండ్ల వ్యాపారంలో కష్టపడి కూడబెట్టిన ప్రతి రూపాయిని కూడబెట్టి, తన స్వగ్రామం న్యూపడపులో ఒక చక్కటి ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. సమాజానికి ఆయన చేసిన ఈ గొప్ప సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020లో దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
అయితే కర్ణాటకలో జూన్ 30 నుంచి ఓటర్ల లిస్ట్ సవరణ ప్రక్రియ (SIR) జరుగుతోంది. ‘నో మ్యాపింగ్’, రికార్డుల్లో అవకతవకలు వంటి కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 లక్షల మందికి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 7.31 లక్షల మందికి ఈ నోటీసులు అందాయి. ఈ సవరణ ప్రక్రియ పూర్తయ్యాక తుది ఓటర్ల లిస్ట్ అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు.