Reading Time: < 1 minute
Shubmangill Vs Abhishek Sharma Revenge Moment Goes Viral In Sher E Punjab T20

ShubmanGill vs Abhishek Sharma: భారత క్రికెట్‌లో చిన్ననాటి నుంచి కలిసి ఎదిగిన స్టార్‌ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మ. పంజాబ్‌ తరఫున కలిసి ఆడిన వీరిద్దరూ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే సోమవారం జరిగిన షెర్‌-ఎ-పంజాబ్‌ టీ20 లీగ్‌ మ్యాచ్‌లో మాత్రం ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫజిల్కా ఫాల్కన్స్‌కు గిల్‌ ప్రాతినిధ్యం వహించగా.. అమృత్‌సర్‌ సోర్మాస్‌ తరఫున అభిషేక్‌ బరిలోకి దిగాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫజిల్కా ఫాల్కన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 67 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే గిల్‌-అభిషేక్‌ శర్మ మధ్య సమరం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిషేక్‌ వేసిన పదో ఓవర్‌ తొలి బంతినే గిల్‌ సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతికి డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా ఫోర్‌ బాదాడు. ఐదో బంతికి మరో భారీ సిక్సర్‌ కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో గిల్‌ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు.

అయితే చివరి బంతికి కథ మారిపోయింది. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన శుభ్‌మన్‌ గిల్‌.. నామన్‌ ధీర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో అభిషేక్‌ శర్మ తనదైన స్టయిల్లో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమృత్‌సర్‌ జట్టు ఛేజింగ్‌లో అభిషేక్‌ చెలరేగాడు. కేవలం 15 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో అమృత్‌సర్‌ సోర్మాస్‌కు ఛేజింగ్‌లో అదిరిపోయే ఆరంభం లభించింది. రాహుల్ కుమార్ (53), ఆకాష్ పాండే (24) రానించడంతో మరో మూడు బంతులు ఉండగానే అమృత్‌సర్‌ గెలిచింది.