
జస్ట్ 14 ఏళ్ల వయసులో ఇంటర్నెట్‌లో గ్రాఫిక్ డిజైనింగ్, ఎడిటింగ్ నేర్చుకుని.. నేడు నెలకు రూ.4 లక్షల వరకు సంపాదిస్తూ సంచలనం సృష్టించాడు బీహార్‌కు చెందిన 20 ఏళ్ల కుర్రోడు. సంప్రదాయ చదువులకు స్వస్తి చెప్పి, స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ కుర్రోడి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం రెడ్డెట్ వేదికగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ దిగువ మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన కుర్రోడు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు యువతకు స్పూర్తిగా నిలుస్తోంది.
చిన్న వయసులోనే ఈతరం పిల్లల్లా సరదాగా గడపకుండా, ఎన్‌స్పోర్ట్స్ టీమ్స్‌తో కలిసి పనిచేస్తూ డిజైనింగ్ రంగంలో అడుగులు పెట్టాడు. అయితే భారతదేశంలో పబ్జీ బ్యాన్ కావడంతో అతని తొలి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఉపాధి కోల్పోవడంతో పాటు డిప్రెషన్, ఒంటరితనం అతన్ని కుంగదీశాయి. ఈ క్లిష్ట సమయంలోనే సాంప్రదాయ డిగ్రీలకు దూరంగా ఉంటూ.. తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.
జీవితంలో స్థిరపడేందుకు 2024లో నోయిడాలోని ఓ వెబ్3 మార్కెటింగ్ ఏజెన్సీలో నెలకు రూ.15వేల జీతానికి చేరాడు. అయితే అక్కడ వాతావరణం నచ్చక తిరిగి బీహార్‌లోని తన సొంతూరికి వచ్చేసాడు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. ఓ ప్రత్యేకమైన టెక్ కమ్యూనిటీకి ఉచితంగా బ్రాండింగ్.. లోగో డిజైనింగ్ సేవలు అందించడం ప్రారంభించాడు. ఈ వినూత్న ప్రయత్నమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఫ్రీ సర్వీస్ ద్వారా వచ్చిన పరిచయాలు, రెఫరల్స్ ద్వారా అతనికి అంతర్జాతీయ క్లయింట్లు లభించారు.
క్రమంగా అతని ఆదాయం నెలకు 200–300 డాలర్ల నుంచి 2వేల డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.12 లక్షలు సంపాదించాడట. ప్రస్తుతం అతని నెలవారీ సంపాదన నిలకడగా రూ.4 లక్షలకు చేరింది. అత్యధికంగా ఒక నెలలో 6వేల500 డాలర్లు సంపాదించానని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక స్వావలంబనతో తను కలలుగన్న మాక్‌బుక్ ప్రొ కొనుక్కోవటంతో పాటు.. తల్లికి బంగారం కొనిపెట్టాడు. అంతేకాకుండా సొంత ఇల్లు కొనుక్కోవటానికి డబ్బు సేవ్ చేయటం కూడా స్టార్ట్ చేశాడు ఈ కుర్రోడు.
డబ్బుల పరంగా ఎంతో సాధించినప్పటికీ.. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదన, ఒంటరితనాన్ని పంచుకున్నారు. తనకు ప్రాణ స్నేహితులు ఎవరూ లేరని.. నిజ జీవితంలో ఇప్పటివరకు గర్ల్‌ఫ్రెండ్ కూడా లేరని నిస్సందేహంగా చెప్పారు. కేవలం తన విజయాన్ని ప్రదర్శించుకోవడానికి కాకుండా, ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకే తన స్టోరీని పంచుకున్నట్లు తెలిపారు. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణం చూసిన నెటిజన్లు అతనికి అభినందనలు తెలుపుతూనే.. కొంచెం సాంఘిక జీవితాన్ని గడపాలని, భవిష్యత్తు కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు.