Reading Time: 2 minutes
Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?

Shubman Gill: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెప్టెంబర్ 8న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా నుంచి ప్రస్థానం ప్రారంభించి అండర్-19 ప్రపంచకప్ స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు ఏకంగా టీమిండియాను నడిపించే స్థాయికి చేరుకున్న గిల్ క్రికెట్ ప్రయాణం ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు ప్రేరణగా నిలుస్తోంది.

 

అండర్-19 సంచలనం నుంచి గాబ్బా హీరోగా

1999 సెప్టెంబర్ 8న జన్మించిన శుభ్‌మన్ గిల్, 2018 అండర్-19 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచి తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 2019లో వన్డేల్లోకి అరంగేట్రం చేసినప్పటికీ, 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలోని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. మెల్‌బోర్న్‌లో అరంగేట్రంలోనే రాణించిన గిల్, సిడ్నీలో హాఫ్ సెంచరీ, చారిత్రాత్మక గాబ్బా టెస్టులో 91 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో భారత్ సిరీస్ గెలవడంలో వెన్నుముకగా నిలిచాడు.

అతి పిన్న వయస్కుడైన డబుల్ సెంచరీ హీరో

వన్డే ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్ నెలకొల్పిన రికార్డులు అసాధారణమైనవి. అంతర్జాతీయ వన్డే చరిత్రలోనే అత్యంత వేగంగా 2,000 అలాగే 2,500 పరుగులు పూర్తి చేసిన సాధకుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 23 ఏళ్ల వయసులోనే న్యూజిలాండ్‌పై 149 బంతుల్లో 208 రన్స్ బాది, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు. 2023 ప్రపంచకప్‌లో 350కి పైగా పరుగులు సాధించడంతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు.

ఇంగ్లండ్‌లో చారిత్రక రికార్డు

రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం 2025 ఇంగ్లండ్ పర్యటన నుంచి గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ సిరీస్‌లో కెప్టెన్‌గా 75.40 సగటుతో ఏకంగా 754 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందులో 4 సెంచరీలు ఉండగా, అత్యుత్తమ స్కోరు 269 కావడం విశేషం. టెస్టు సిరీస్‌లో ఒక కెప్టెన్ సాధించిన రెండో అత్యధిక పరుగుల రికార్డు ఇది. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ (810 పరుగులు) తర్వాత స్థానంలో నిలిచిన గిల్, ఆ పర్యటనలో భారత్ 2-2తో సిరీస్ సమం చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 1-0తో గెలిపించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ సారథిగా సఫలమవుతూనే, 2026 సీజన్‌లో 732 పరుగులతో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు.

మూడు ఫార్మాట్లలో అద్భుత గణాంకాలు

ఇప్పటివరకు 43 టెస్టుల్లో 43.47 సగటుతో 3,043 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతడి గణాంకాలు మరిన్ని అద్భుతంగా ఉన్నాయి. 67 వన్డేల్లో 60.33 సగటుతో 3,379 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 20 ఫిఫ్టీలు ఉన్నాయి. టి20ల్లో 36 మ్యాచ్‌ల్లో 138.59 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీతో సహా 869 రన్స్ సాధించాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..