Reading Time: 3 minutes

ఒక వేలితో చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మీవైపే.. బీఆర్ఎస్ చిట్టా విప్పితే..

Caption of Image.

చూపుడు వేలితో ఎదుటివారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తాయనే విజ్ఞత మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థకు లేకపోవడం బాధాకరం. పోనీ అవి ఏమైనా సామాన్య ప్రజల సమస్యలను ఎత్తిచూపుతున్నారా అంటే అది కూడా కాదు. ఇందుకు ఉదాహరణ.. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పరిపాలన సందర్భంగా ముఖ్యమంత్రి ఇటీవల నకిరేకల్ సభలో చేసిన వ్యాఖ్యానం. కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చిన పిలుపు ప్రతిపక్ష రాజకీయ పార్టీలలో ఒక కదలికను తీసుకువచ్చింది.

ప్రజలలో ఒక ఆలోచనను రేకెత్తించింది. హామీలు నెరవేర్చడం, నెరవేర్చకపోవడం ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన అంశం. ఈ విషయం రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. కానీ  ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ ప్రతిపక్షాలు అధికారపక్షంపై  నిర్మాణాత్మకంగా వివరించిన దాఖలాలు లేవు. తాము అధికారంలో ఉంటే  ఒక తీరు, ఇతరులు అధికారంలో ఉంటే  మరో తరీకగా  వ్యవహరించడం 80 సంవత్సరాల  భారతీయ స్వాతంత్ర్య  దేశంలో రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది.  ఒకవిధంగా యాంత్రికంగా మారింది.

బీఆర్ఎస్ చిత్ర, విచిత్ర విన్యాసాలు
2028 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ  ప్రతిపక్ష పార్టీలు,  అధికార పార్టీ  తమ తమ వ్యూహాలు,  ఎత్తుగడలను మాటల ఆకురాయితో పదును పెడుతున్నారు.  ఈ నేపథ్యంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు చిత్ర  విచిత్ర విన్యాసాలను,  సాము గారడీలను  చేస్తున్నారు.  పీట చెక్కతో  నిన్నిట్లంటే  తలుపు చెక్కతో తాను ఇట్లనే అన్నట్టుగా ఉంది.  శాసనసభలో  ప్రధాన ప్రతిపక్షమైన  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ ఆయా జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో, మండల కార్యాలయంలో,  ప్రజావాణిలో కాంగ్రెస్ పార్టీ  నెరవేర్చని హామీలపైన దరఖాస్తు  ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.

ప్రతిపక్ష పార్టీ  బాధ్యతయుతంగా బేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తన పాత్ర  నిర్వహిస్తున్నది. కానీ శాసనసభలోకి నల్లచొక్కాలతో వెళ్లాలని ప్రయత్నించిన  శాసనసభ్యులను పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో ఉప  ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు శివాలెత్తిపోయాడు.  నల్ల చొక్కాను  విప్పి విసిరివేశాడు. ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టు బండ్ల వీడియోస్ దగ్గర అమరవీరుల స్తూపం తాకే అర్హత కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.  తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినవారిని,   ప్రజలలో ఒకసారి  నమ్మకం కోల్పోయిన నాయకులను,  పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తామని భ్రమతో ఇదంతా హడావిడి చేస్తున్నారు.

బీఆర్ఎస్ చిట్టా విప్పితే చిత్రగుప్తుని తప్పుల పుస్తకం సరిపోదు
తాము సుమారు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కనిపించని,  వినిపించని  ప్రజాస్వామ్యం  గురించి నోరెత్తనివారు,  ప్రగతి భవన్  గడియలు బంధించినప్పుడు మాట్లాడనివారు ఇప్పుడు  ఏదో కొంప మునిగినట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉంది.   దళిత  ముఖ్యమంత్రి,   దళిత బంధు ఇంకా చాలా నెరవేర్చని  హామీలు,   తెలంగాణ  అమరవీరుల కుటుంబాలకు చేసిన అన్యాయం..  ప్రజలు మరిచిపోతారు అనుకుంటే మీ అంత అవివేకులు ఇంకొకరు ఉండరు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హయాంలో  చేసిన క్విడ్ ప్రోకో  లాలూచీ వ్యవహారాలు, రాజకీయాలు తెలియనిది ఎవరికి?.

ప్రజలు అంత తొందరగా మీరు చేసిన అన్యాయాలను, అవినీతిని,  అక్రమాలను  మరిచిపోతారని భావిస్తున్నారంటే మీరు గాలిలో మేడలు  నిర్మించినట్టే  భావించాల్సి వస్తుంది.  గత  ఎన్నికల్లో మీ  నాయకుడు  కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..  ‘మీరు ఓడిస్తే నేను ఫామ్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విశ్రాంతి  తీసుకుంటాను’ అన్న మాటలు తెలంగాణ జాగరుక సమాజం సమూహం మర్చిపోలేదు.  అందుకే  తెలంగాణ సమాజం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  అధికారం నుంచి దింపి సాగనంపింది.. ఇకపోతే బీఆర్ఎస్  పాలనలో చేసిన అక్రమాల చిట్టా విప్పితే  చిత్రగుప్తుని తప్పుల పుస్తకం సరిపోదు. 

బూతు రాజకీయాలకు ఆద్యుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ధరణి పేరు మీద చేసిన భూమి అక్రమాలు రికార్డు లేకుండా చేయడం,  20,000 కోట్ల రూపాయలు రైతుబంధు  పేరు మీద హనుమాన్ల గుడి దగ్గర  పలారం లెక్క ఏ వర్గాలకు పంచి పెట్టింది  తెలంగాణ సమాజానికి గ్రహింపు లేదనుకుంటే మరోసారి తప్పులో కాలేసినట్టే.

కేసీఆర్ బూతుల ముఖ్యమంత్రి దగ్గర ఏం చర్చించాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది.  రాజకీయాల్లోకి బూతులను ప్రవేశపెట్టిన ఆద్యుడు  కేసీఆర్  కాదా.  దొంగే దొంగ అన్నట్టు  మీ తప్పులను దాచిపెట్టి  సుమతి శతకాలు,  వేమన సూక్తులు  ఆశ్చర్యకరంగా  వినిపిస్తున్నారు.

ఉద్యమ కాలంలోనే  కాదు అధికారంలోకి  వచ్చిన  తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు,  మీ ముఖ్యమంత్రి కేసీఆర్ బూతులను ఏమాత్రం  వదులుకోలేదు. పైగా ప్రతి బహిరంగ సభలో అవాకులు పేలినది  మీరే కదా! ఇన్ని ఫామ్ హౌసులు,  వేలాది కోట్ల రూపాయలు ఎక్కడ  చెమట వడిపి సంపాదించారో గుండెమీద చేయి వేసుకుని చెప్పండి చూద్దాం. 

ఇంకా మీరు మీ నాయకులు అధికారంలోకి  మేమే వస్తాం అనే తడి  ఇసుకతో  గుజ్జనగూళ్లు కడుతున్నారు. అవి ఒక క్షణంలో కూలిపోతాయి. బీఆర్ఎస్ నాయకుల్లారా మీరు ఊహాలోకం నుంచి నేలమీద కాలుపెట్టి నిలబడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే  ప్రజలు అప్పుడేమైనా  ఆలోచిస్తారేమో  చూడాలి.  అంతవరకు ఇంతే సంగతులు.

జూకంటి జగన్నాథం, కవి, రచయిత

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
©️ VIL Media Pvt Ltd.