Reading Time: < 1 minute
Former Delhi Chief Secretary Rakesh Mehta Dies By Suicide Noida

Rakesh Mehta: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, 1975 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా తనువు చాలించారు. 74 ఏళ్ల మెహతా నోయిడాలోని సెక్టార్ 82లో ఉన్న కేంద్రీయ విహార్-2 సొసైటీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సెప్టెంబరు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫేజ్-2 పోలీస్ స్టేషన్ బృందం, లోపల నుంచి గడియ పెట్టి ఉన్న తలుపులను పగలగొట్టి చూడగా మెహతా మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో, తాను ఎదుర్కొంటున్న మానసిక, ఆరోగ్య సమస్యల కారణంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సంఘటన సమయంలో ఆయన భార్య సుమంతి మెహతా డెహ్రాడూన్‌లోని కుమారుడి వద్ద ఉన్నారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు రంగ్ లోకి దిగారు.

పూర్వ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో 2007 నుంచి 2010 నవంబర్ పదవీ విరమణ వరకు మెహతా ఢిల్లీ సీఎస్ (చీఫ్ సెక్రటరీ)గా సేవలందించారు. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మక 2010 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఆ సమయంలో ఢిల్లీని ఆధునీకరించే అనేక కీలకమైన రవాణా, విద్యుత్, మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కమిషనర్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించగా, సోమవారం లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన దహన సంస్కారాలు ముగిశాయి. ఫోరెన్సిక్ ఆధారాలు, లభ్యమైన సూసైడ్ నోట్ సహాయంతో ఫేజ్-2 పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.