Reading Time: < 1 minute
Yash In Ramayana Ravana Gets 1 Plus Hour Screen Time In Part 1

Yash Ravana Screen Time in Ramayana Part 1: నితీశ్‌ తివారి దర్శకత్వంలో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రూ.4000 కోట్లతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. పార్ట్‌-1 ఈ దీపావళికి విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ ఆసక్తిని పెంచుతోంది. తాజాగా కన్నడ స్టార్ యశ్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రామాయణ పార్ట్‌-1లో యశ్ పాత్రకు గంటకు పైగా స్క్రీన్‌ టైమ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రావణుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో.. యశ్ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్‌. రావణుడి పాత్ర కోసం కన్నడ స్టార్ 55 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడట. రావణుడి పాత్రను అత్యంత భారీ స్థాయిలో, ప్రత్యేకమైన లుక్‌తో చూపించేందుకు మేకర్స్‌ భారీగా వర్క్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రావణుడి ఆగ్రహం, వ్యక్తిత్వం, శక్తిని తెరపై ప్రభావవంతంగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్‌.

యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ చిత్రం నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్‌-1లో రావణుడి పాత్రకు ఉన్న ప్రాధాన్యం సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. ఇటీవల ట్రైలర్‌ విడుదల కాగా.. అది విజువల్‌ వండర్‌గా నిలిచింది. ట్రైలర్‌లో రావణుడిగా యశ్ విశ్వరూపం చూపాడు. గంటకు పైగా స్క్రీన్‌ టైమ్‌ ఉండడంతో యశ్ నటనా బీభత్సం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రావణుడి భార్య మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌.. సోదరి శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. రావణుడి తల్లి కైకసిగా సీనియర్ నటి శోభన నటిస్తున్నారు.