Reading Time: 2 minutes

రీజనల్ రూరల్ బ్యాంక్స్ విలీనం తప్పుడు నిర్ణయం: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సి. రంగరాజన్

Caption of Image.

దేశవ్యాప్తంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్(RRB) సంఖ్య భారీగా తగ్గిపోవడంపై RBI మాజీ గవర్నర్ సి. రంగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన RRBల విలీన ప్రక్రియ తన దృష్టిలో పూర్తిగా తప్పుడు నిర్ణయమని చెప్పారు. చెన్నైలో జరిగిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ విలీన విధానం వల్ల స్థానిక, ప్రాంతీయ బ్యాంకుల ప్రత్యేక స్వభావం దెబ్బతింటోందని.. భవిష్యత్తులో ఇవి పూర్తిగా సాధారణ ‘యూనివర్శల్ బ్యాంకుల్లో’ కలిసిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో లోన్స్ మరింత సమానంగా పంపిణీ కావాలనే ఉద్దేశంతోనే ఒకప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి, భారీ స్థాయి కార్యకలాపాల ప్రయోజనాలను అందుకోవడానికి 2005 నుంచి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా విలీనాలు చేస్తూ వస్తోంది. గత ఏడాది జులైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. తొలి దశలో2005-2010 మధ్య RRBల సంఖ్య 196 నుంచి 82కి పడిపోయింది. తాజాగా అమల్లోకి వచ్చిన ‘ఒక రాష్ట్రం-ఒక RRB’ విధానంతో ఈ సంఖ్య మరింత తగ్గింది. మే 1, 2025 నాటికి సంఖ్య 43 నుంచి కేవలం 28కి పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ పరిణామం గ్రామీణ బ్యాంకింగ్ మూలాలకే ముప్పు తెస్తోందని రంగరాజన్ అన్నారు. 

దేశంలోని లోన్ అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేవలం 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏమాత్రం సరిపోవని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ రంగాన్ని మరింత విస్తరించే మార్గాలను రిజర్వు బ్యాంక్ పరిశీలించాలని కోరారు. అయితే కేవలం కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని.. వాటిని నిర్వహించే యాజమాన్యాల స్ఫూర్తి, లక్ష్యాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో స్వయం సహాయక సంఘాల పరిణామ క్రమం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి హామీతో ఆర్థిక చేయూతనందించేందుకు తాను 1993-94లో సర్క్యులర్ జారీ చేశానని గుర్తుచేసిన రాజన్.. నేడు ఎస్‌హెచ్‌జీలు తమ అసలైన లక్ష్యాన్ని కోల్పోయి, కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేసే సాధనాలుగా మాత్రమే మిగిలిపోయాయని చెప్పారు.

భారతదేశంలో బలహీన వర్గాలకు రుణాలు అందించే వ్యవస్థలో బ్యాంకుల జాతీయీకరణ, ప్రాధాన్యతా రంగ రుణాలు, ఆర్‌ఆర్‌బీలు, స్థానిక బ్యాంకులు, స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాయి. కానీ ప్రస్తుత సంస్కరణలు, విలీనాల పేరుతో గ్రామీణ ఆర్థిక వేళ్లనే కత్తిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వ గ్రామీణ బ్యాంకింగ్ విధానాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక అవసరాలను గుర్తించి పనిచేసే ప్రాంతీయ బ్యాంకుల ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు రంగరాజన్.

©️ VIL Media Pvt Ltd.