Reading Time: 2 minutes

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..మరిన్ని రూట్లకు నైట్ బస్సులు

Caption of Image.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రిపూట ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిన థర్డ్ షిఫ్ట్ రాత్రి బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ సర్వీసుల్లో 9,286 మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఉద్యోగులు, విద్యార్థులు, రాత్రి వేళల్లో ప్రయాణించే ఇతర వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1, 2026 నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఆరు ప్రధాన రూట్లలో రాత్రిపూట ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

ఆరు రూట్లలో రాత్రి బస్సు సర్వీసులు

1. రూట్ నంబర్ 222A: కోఠి – పటాన్‌చెరు

అబిడ్స్, లక్డికాపూల్, కేర్ హాస్పిటల్, అన్నపూర్ణ, ఉషాకిరణ్, గుట్లబేగంపేట్, కొండాపూర్ క్రాస్‌రోడ్, హఫీజ్‌పేట్, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరంగుడి మీదుగా పటాన్‌చెరు వరకు బస్సులు నడుస్తాయి.
బస్సులు: 4
ట్రిప్పులు: 16
ఫ్రీక్వెన్సీ: 45 నిమిషాలు

2. రూట్ నంబర్ 218: అఫ్జల్‌గంజ్ – పటాన్‌చెరు

CBS, కోఠి, లక్డికాపూల్, ఎస్‌ఆర్ నగర్, వై జంక్షన్, KPHB, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా సర్వీసులు కొనసాగుతాయి.
బస్సులు: 2
ట్రిప్పులు: 8
ఫ్రీక్వెన్సీ: 75 నిమిషాలు

3. రూట్ నంబర్ 219: సికింద్రాబాద్ – పటాన్‌చెరు

ప్యారడైజ్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, బాలానగర్ క్రాస్‌రోడ్, IDPL, ప్రశాంత్‌నగర్, కూకట్‌పల్లి, KPHB, హైదర్‌నగర్, గంగారం, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా పటాన్‌చెరు వరకు బస్సులు నడుస్తాయి.
బస్సులు: 2
ట్రిప్పులు: 8
ఫ్రీక్వెన్సీ: 75 నిమిషాలు

4. రూట్ నంబర్ 290U: హయత్‌నగర్ – సికింద్రాబాద్

భాగ్యలత, పనామా, ఎల్‌బీ నగర్, అల్కాపురి, నాగోల్, నాగోల్ మెట్రో స్టేషన్, సర్వే ఆఫ్ ఇండియా, NGRI, తార్నాక, అలుగడ్డబావి, చిలకలగూడ, రాతిఫైల్, సికింద్రాబాద్ ఆల్ఫా, JBS మీదుగా సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
బస్సులు: 3
ట్రిప్పులు: 14
ఫ్రీక్వెన్సీ: 75 నిమిషాలు

5. రూట్ నంబర్ 195W: బాచుపల్లి – వేవ్‌రాక్

నిజాంపేట్, నిజాంపేట్ క్రాస్‌రోడ్, JNTU, హైటెక్ సిటీ, ESIC, ఇందిరానగర్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ మీదుగా వేవ్‌రాక్ వరకు సర్వీసులు కొనసాగుతాయి.
బస్సులు: 3
ట్రిప్పులు: 18
ఫ్రీక్వెన్సీ: 40 నిమిషాలు

6. రూట్ నంబర్ 10H: కొండాపూర్ – సికింద్రాబాద్

ప్లాజా, పోలీస్ లైన్స్, ఆర్‌జే కాలేజ్, స్టేట్ హోమ్, ఉషాకిరణ్, సైబర్ టవర్స్ మీదుగా సికింద్రాబాద్ వరకు బస్సులు నడుస్తాయి.
బస్సులు: 2
ట్రిప్పులు: 6
ఫ్రీక్వెన్సీ: 50 నిమిషాలు

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ రాత్రిపూట బస్సు సర్వీసులకు తొలి ఏడు రోజుల్లోనే 9,286 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.అర్ధరాత్రి వేళల్లోనూ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నగర ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని రూట్లకు థర్డ్ షిఫ్ట్ సేవలు

రాత్రిపూట మరిన్ని కొత్త రూట్లలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ, రూట్ల అవసరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించి భవిష్యత్తులో మరిన్ని ప్రధాన మార్గాల్లో థర్డ్ షిఫ్ట్ సర్వీసులను విస్తరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసి, 24 గంటలూ అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.