
గానకోకిల ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. కోట్లాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించి, 20 భాషల్లో 48 వేలకు పైగా మధుర గీతాలను ఆలపించిన జానకమ్మ భౌతికకాయానికి కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మైసూర్ సమీపంలోని ఫార్మ్‌హౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఈ కష్ట సమయంలో కూడా కొందరు నెటిజన్లు అత్యంత దారుణమైన ట్రోలింగ్‌కు తెరలేపారు.
నానమ్మపై నాకున్న ప్రేమను లెక్కకట్టొద్దు..
ఆమె మనవరాలు అప్సర విద్యుల అనవసరమైన సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంత్యక్రియల సమయంలో అప్సర కన్నీళ్లు పెట్టుకోలేదని, ఆమెకు నానమ్మపై ప్రేమ లేదంటూ కొందరు చేసిన వ్యాఖ్యలకు ఆమె ఎంతో హుందాగా, హృదయాన్ని కదిలించేలా సమాధానమిచ్చింది. కన్నీళ్లు కారిస్తేనే బాధ ఉన్నట్టా? ‘దుఃఖం అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరు బిగ్గరగా ఏడుస్తారు.. మరికొందరు మౌనంగా బాధను మోస్తారు. మీరు చూసిన, చూడని నా కన్నీళ్లతో నానమ్మపై నాకున్న ప్రేమను లెక్కకట్టొద్దు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రాసిన సందేశం వేలాది మందిని కదిలించింది.
వరుస విషాదంతో..
ప్రస్తుతం అస్పర పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అప్సర తన కుటుంబం వరుసగా ఎదుర్కొన్న విషాదాలను కూడా గుర్తు చేసుకుంది. 2023లో తన అక్క వర్షను కోల్పోయామని, ఆ బాధ నుంచి కుటుంబం ఇంకా బయటపడకముందే ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రమాదంలో తండ్రిని కూడా కోల్పోయామని తెలిపింది. నానమ్మకు వర్ష అంటే ఎంతో ప్రాణమని, ఆమె ఉంటే అంత్యక్రియల బాధ్యతలను వర్షే నిర్వహించేదని చెప్పింది. కానీ పరిస్థితులు తనను ఆ బాధ్యతను నిర్వర్తించేలా చేశాయని భావోద్వేగంగా వెల్లడించింది.
►ALSO READ | Anna Konidela: ‘ఆయన మోసే భారం భుజం నొప్పి కంటే పెద్దది’.. పవన్ సర్జరీపై అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్ !
‘ప్రాణం దూరమైనా ప్రేమ దూరం కాదు. జ్ఞాపకాలే మనకు బలం ఇస్తాయి’అని నానమ్మ చెప్పిన మాటలే ఇప్పుడు తనకు ధైర్యంగా నిలుస్తున్నాయని అప్సర పేర్కొంది. తనకు ఇప్పుడు ఉన్న ఓదార్పు ఒక్కటేనని, నానమ్మ జానకి, అక్క వర్ష ఇద్దరూ ఎక్కడో ఒకచోట మళ్లీ కలుసుకుని ఉంటారనే నమ్మకమే తనను నిలబెడుతోందని చెప్పిందంటూ ఎమోషనల్ అయింది .
అప్సరకు అండగా అభిమానులు..
అప్సర పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ‘బాధను కన్నీళ్లతో కాదు.. మనసుతో అర్థం చేసుకోవాలి’, ‘ప్రతి ఒక్కరూ తమ దుఃఖాన్ని వ్యక్తం చేసే తీరు వేరు’ అంటూ నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఒక కుటుంబం వరుసగా ఎదుర్కొన్న విషాదాన్ని గౌరవించాలని, శోకంలో ఉన్న వారిని తీర్పు ఇవ్వకుండా వారి భావాలను అర్థం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. నిజానికి, ప్రేమకు కన్నీళ్లు కొలమానం కావని.. మౌనంలో దాగి ఉండే బాధే కొన్నిసార్లు అత్యంత లోతైనదని అప్సర స్పందన మరోసారి గుర్తు చేసిందంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు అభిమానులు..