పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు బ్యాన్.. తక్షణమే నిషేధం అమల్లోకి అని చెప్పిన ప్రభుత్వం

ఢిల్లీ: ప్రాణాంతకమైన గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పారాక్వాట్‌పై తక్షణమే పూర్తి నిషేధాన్ని విధిస్తూ కేంద్రం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 70కి పైగా దేశాల్లో నిషేధం అమల్లో ఉంది. ఈ పారాక్వాట్ ఎంత ప్రాణాంతకమో అవగాహన లేక భారత్లో ఇప్పటికీ విరివిగా పారాక్వాట్ డైక్లోరైడ్‌ను రైతులు వినిగియోస్తున్నారు.
గడ్డి నివారణకు, కలుపు మొక్కల నివారణకు ఈ పారాక్వాట్ పిచికారీ చేస్తున్నారు. పారాక్వాట్‌ను పిచికారీ చేసే రైతుల్లో క్యాన్సర్, నాడీ సంబంధిత సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. పారాక్వాట్ వాడకం వల్ల పర్యావరణానికి నష్టంతో పాటు మనిషి ప్రాణాలకే ప్రమాదం అని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో తక్షణమే నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
పారాక్వాట్ ఒక సాధారణ కలుపు మందు మాత్రమే కాదు. మనిషి దీని ప్రభావానికి లోనైతే విరుగుడు కూడా లేదు. అందుకే.. డాక్టర్లు ఈ గడ్డి మందును అత్యంత ప్రాణాంతకమైన వ్యవసాయ రసాయనాలలో చెబుతారు. కొద్ది మోతాదు కూడా ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టేంత ప్రమాదం. మనిషి శరీరంలోకి ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ వెళ్లిదంటే.. ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. కోలుకోలేని ఫైబ్రోసిస్‌కు కారణమవుతుంది.
►ALSO READ | ట్యాంకర్లకు ట్యాంకర్ల పాలు మురికి కాలువలో పారబోశారు.. ఇవి గానీ తాగితే మనిషి ప్రాణాలతో ఉంటాడా..?
ఇలా జరిగితే.. రోగులు శ్వాస తీసుకోలేకపోతారు. ఇది మూత్రపిండాలు, కాలేయం, చర్మం, కళ్ళను కూడా తీవ్రంగా దెబ్బతీసి మనిషి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. ప్రమాదవశాత్తు దీనిని మింగినా, మందు పిచికారీ చేసే సమయంలో.. సన్నని తుంపరలు పీల్చినా రైతులు తీవ్ర అస్వస్థతకు లోనవుతారు. ఈ కారణాల వల్ల యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్, చైనాతో సహా 70కి పైగా దేశాలు ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ వాడకాన్ని నిషేధించాయి.