
- ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయని యూఏఈ ప్రభుత్వం
- హార్మూజ్ మాదేనంటూ ట్రంప్ ట్వీట్.. ఒక్క ట్వీట్‌తో మీదైపోదన్న ఇరాన్
- ట్రంప్ జోక్ చేశారన్న వైట్‌హౌస్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి ప్రాంతంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ)కి చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు యూఏఈ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ వామ్ ధ్రువీకరించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లోనే ఏడీఎన్ వోసీ సంస్థకు చెందిన నౌకలపై దాడులు జరగడం ఇది మూడోసారి. గతంలో జరిగిన దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని యూఏఈ ఆరోపించింది. తాజా ఘటనపై యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే, అబుదాబి ట్యాంకర్‌పై దాడితోనే ఉద్రిక్తత ఆగలేదు. మరో వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ బల్క్ క్యారియర్ నౌకను ఒక మిసైల్ లాంటి ఆయుధం బలంగా ఢీకొన్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్’ తెలిపింది. ఈ వరుస దాడులతో హార్ముజ్ జలసంధి ప్రాంతంలో మళ్లీ భయానక వాతావరణం ఏర్పడింది.
హార్మూజ్ ఎప్పటికీ మాదే: ఇరాన్
హార్మూజ్ జలసంధిని త్వరలోనే అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌పై ఇరాన్ మండిపడింది. హార్ముజ్ జలసంధి ఎప్పటికీ తమదేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరిబాబాడి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కేవలం ఒక ట్వీట్‌తో, విమాన వాహక నౌకతో, ఎన్నికల ప్రసంగాలతో ట్రంప్ హార్మూజ్‌ను ఆక్రమించలేరు. యుద్ధ ప్రారంభం నుంచే జలసంధిని మూసివేశాం. ఇకపైనా ఇరాన్ ఆదేశాల మేరకే హార్మూజ్ నడుస్తుంది. అమెరికా ఇప్పటివరకు భారీ ఓటములను చవిచూసింది. ఆ వాస్తవాన్ని అంగీకరించే వరకు ఇరాన్ హార్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తుంది’ అని స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి స్పందిస్తూ.. జలసంధి గుండా నౌకలు సాధారణంగా వెళ్తున్నాయన్న అమెరికా ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు. ఇరాన్ అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక హార్మూజ్ మార్గం గుండా వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇరాన్ అగ్రనేత అబ్బాస్ అరాఘ్చి కూడా అమెరికా తీరుపై మండిపడ్డారు. నిఘా వైఫల్యాల కారణంగా అమెరికా ఎప్పుడూ తప్పుడు అంచనాలు వేస్తూనే ఉందని విమర్శించారు. శుక్రవారం న్యూయార్క్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ను పూర్తిగా ఓడించిన తర్వాతే హార్మూజ్ జలమార్గాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలు కేవలం సరదాగా చేసిన జోక్ మాత్రమేనని వైట్ హౌస్ వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.