
- గ్లోబల్ సమిట్ పెట్టుబడులతో కొత్తగా 78 వేల ఉద్యోగాలు
- మా ప్రభుత్వ 32 నెలల శ్రమ ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది
- గిగ్ వర్కర్ల మాదిరి.. సినీ కార్మికులకు త్వరలోనే వెల్ఫేర్ బోర్డు
- గోల్కొండలో స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
- స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేద ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన చట్టబద్ధమైన వాటా ను సాధించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కితగ్గం.. తెలంగాణ గడ్డపై పారే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుని తీరుతాం.. చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది..’ అని స్పష్టం చేశారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురై దశాబ్దాలుగా నలుగుతున్న తుమ్మిడిహెట్టి నుంచి పాలమూరు- రంగారెడ్డి వరకు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టులను సాకారం చేసి, బీడు భూములను సస్యశ్యామలం చేసి తీరతామన్నారు. వ్యవసాయాన్ని దండుగ అనే దుస్థితి నుంచి మార్చి, రైతులు గర్వంగా తలెత్తుకునేలా చేసి వారి కళ్లల్లో అసలైన ఆనందాన్ని చూడటమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని చెప్పారు. ఓట్ల కోసమో, మొక్కుబడి హామీలుగానో సంక్షేమాన్ని చూడడం లేదన్న సీఎం, ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ సంక్షేమాన్ని విస్తరించామన్నారు. తమశ్రమకు ఇప్పుడిప్పుడే ఫలితం కనిపిస్తోందని చెప్పారు.
ఐటీ ఎగుమతులు 3.97 లక్షల కోట్లు
ఐటీ ఎగుమతులు రూ.3,97,000 కోట్లకు చేరగా, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయని సీఎం అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు, టీజీ-ఐపాస్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, తద్వారా కొత్తగా 78 వేల ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు. ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్ జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 355కు పైగా జీసీసీలు పని చేస్తున్నాయని, గత 6 నెలల్లోనే హైదరాబాద్‌లో 40 జీసీసీలు ఏర్పాటయ్యాయని వివరించారు. అమెజాన్ సంస్థ రాష్ట్రంలో 7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోందని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా గిగ్ కార్మికుల సంక్షేమం కోసం చట్టం చేశామని, సినీ కార్మికుల సంక్షేమం కోసం కూడా త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
వాట్సాప్‌లో 581కి పైగా ప్రభుత్వ సేవలు
పాలనలో పారదర్శకత కోసం సచివాలయంలోని 36 శాఖల్లో 100 శాతం ఈ- ఆఫీస్ విధానాన్ని తెచ్చి, దేశంలోనే తొలి పూర్తి స్థాయి డిజిటల్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించామని సీఎం తెలిపారు. వాట్సాప్ ద్వారా 581కి పైగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి సోమవారం అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నామని, త్వరలో ఆన్‌లైన్ ప్రజావాణి పోర్టల్ ద్వారా ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. దరఖాస్తుల పురోగతిని ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, వంద రోజుల్లోనే రూ. 6 వేల కోట్ల పెండింగ్ డీఏలు, బకాయిలను విడుదల చేశామని వివరించారు. గోషామహల్‌లో రూ.1,000 కోట్లతో 2,000 పడకల సరికొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ నగరాల్లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. సనత్‌నగర్ టిమ్స్ త్వరలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. నిమ్స్‌లో 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి కాగా, దక్షిణ భారతంలోనే తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ ఇక్కడే జరిగిందన్నారు. సీఎంఆర్ఎఫ్తో 5.18 లక్షల మందికి రూ.2526 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు.
సాచ్యురేషన్ మోడ్‌లో 2.25 లక్షల కొత్త పింఛన్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ తొలి విడతలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గిరిజనులు, ఆదివాసీలు, చెంచులకు మొదటి ప్రాధాన్యతనిచ్చామని సీఎం తెలిపారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత-, గీత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులతో కలిపి కొత్తగా మరో 2.25 లక్షల మందికి సాచ్యురేషన్ మోడ్‌లో కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వృద్ధ తల్లిదండ్రులను పోషించకుండా నిరాదరించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే సరికొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చామని చెప్పారు.
జాబ్ మేళాలతో 5,700 మందికి ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో రాష్ట్రం 28వ స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకిందని, మొదటి స్థానమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించామని, ఇప్పటికే శిక్షణ పొందిన 1,190 మందిలో 838 మంది ప్రముఖ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) తీర్చిదిద్దామని, మరో 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునీకరిస్తున్నామన్నారు. జాబ్ మేళాలతో 5700 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను ఆమోదించి 1.11 కోట్ల మంది అసంఘటిత కార్మికుల నెలవారీ వేతనాలను రూ.16,000 నుంచి రూ.20,000 వరకు పెంచామని వివరించారు.
రైతు సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్లు
ఏకకాలంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని సీఎం వివరించారు. 25 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఇప్పటివరకు రూ.36 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయాన్ని అందించగా, కేవలం 9 రోజుల వ్యవధిలోనే రూ.9 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. గడచిన యాసంగిలో 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.32 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించి ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసిందన్నారు. గడిచిన 32 నెలల కాలంలోనే వ్యవసాయం, రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం దాదాపు రూ.1,70,000 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి రైతు ప్రభుత్వంగా నిరూపించుకుందన్నారు.
లేక్ ఎకానమీని ప్రోత్సహిస్తున్నం
మహేశ్వరం పరిధిలో 30 వేల ఎకరాల్లో దేశంలోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని, ఇందులో హైపర్‌స్కేల్ ఏఐ క్యాంపస్‌లు, లైఫ్ సైన్సెస్ క్లస్టర్లు కొలువుదీరుతున్నాయని సీఎం తెలిపారు. మహేశ్వరం రైతులకు తగిన నష్ట పరిహారం ఇస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు 360 కి.మీ ఆర్ఆర్ఆర్, 6092 కి.మీ హ్యామ్ రోడ్లు, రేడియల్ రోడ్ల పనులు చేపట్టామ న్నారు. మెట్రో రెండో దశలో 7 కారిడార్ల ద్వారా 112.9 కి.మీ విస్తరణ పనులు వేగవంతం చేశామన్నారు. తీవ్ర కాలుష్యంతో ఉన్న మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు 55 కి.మీ పరిధిలో 39 కొత్త ఎస్టీపీలు నిర్మిస్తూ, గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన జలాలను మూసీలోకి తరలిస్తున్నామన్నారు. బతుకమ్మ కుంట, నల్లచెరువులను సుందరీకరించి ‘లేక్ ఎకానమీ’ని ప్రోత్సహిస్తున్నామన్నారు. వరం గల్ మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్ర యాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. గచ్చిబౌలిలో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్
యూని వర్సిటీ’ని నెలకొల్పి గ్రామీణ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామని, త్వరలో ‘ఖేలో ఇండి యా యూత్ గేమ్స్-2026’కు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.