Reading Time: < 1 minute

రైతు కష్టాలకు చెక్ : కోల్డ్ స్టోరేజ్తో రైతులకు ప్రయోజనం.. మెదక్ జిల్లా దంతాలపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ

Caption of Image.

శివ్వంపేట, వెలుగు : కోల్డ్ స్టోరేజీతో రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్​ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి డాక్టర్​ వివేక్​వెంకట స్వామి అన్నారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాలపల్లిలో ఆర్ఆర్ఆర్​ సీడ్స్ కు సంబంధించిన​ రూ.20 కోట్లతో 7 వేల మెట్రిక్​ టన్నుల నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న కోల్డ్ స్టోరేజీకి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీ అందుబాటులో ఉంటే పంటలకు సరైన ధర లభించనప్పుడు రైతులు తమ పంట ఉత్పత్తులను అందులో నిల్వ చేసుకోని ఆశించిన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చన్నారు. కోల్డ్​ స్టోరేజీ వల్ల స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు,  జిల్లా లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి అవుతుందని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ లకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీ సరిపోదని, దాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 

మెదక్ జిల్లాలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్​రెడ్డిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచులు మమత, సమత  తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.