Reading Time: 2 minutes
ఆటోమొబైల్​ మార్కెట్‌ను షేక్ చేయడానికి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో మారుతి రెడీ.. స్పెషాలిటీస్‌ ఏంటంటే

మారుతి సుజుకి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కొత్త రూపంలో రానుంది. సెప్టెంబర్ 5న మార్కెట్లోకి విడుదల కానున్న ఈ కారులో పలు ఆకర్షణీయమైన డిజైన్ మార్పులు చేశారు. టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20 వంటి కార్లకు ఇది మరింత గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంటీరియర్ హంగులు

ఈ కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాహ్య రూపంలో పెద్దగా మార్పులు లేకపోయినా, ముందు భాగంలో కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులను ప్రవేశపెట్టనున్నారు. టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం సరికొత్త ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్‌ల మధ్య సన్నని క్రోమ్ స్ట్రిప్ అందించే అవకాశం ఉంది. అలాగే వెనుక భాగంలో చిన్నపాటి మార్పులతో పాటు కొత్త డిజైన్‌తో కూడిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను జతచేయనున్నారు. క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ దాదాపు పాత మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, సరికొత్త సీటు అప్‌హోల్స్టరీ, ఆకర్షణీయమైన కలర్ థీమ్ వంటి మార్పులతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లను అందించే ఛాన్స్ ఉంది.

ఇక టెక్నాలజీ మరియు కంఫర్ట్ పరంగా చూస్తే, ఇందులో హెడ్ అప్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్ అందించే అతికొద్ది కార్లలో ఇది ఒకటి. దీనితో పాటు 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హైట్ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు వంటి సదుపాయాలు యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే బ్రెజ్జాలో ఉన్నటువంటి పెద్ద 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను దీనికి ఇస్తారా లేదా అనేది లాంచ్ రోజే స్పష్టమవుతుంది.

శక్తివంతమైన ఇంజన్

పనితీరు విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంజన్ 88bhp పవర్, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ అలాగే ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు సీఎన్‌జీ వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్త వెర్షన్‌లో టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ప్రవేశపెడతారనే ఊహాగానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో గతంతో పోలిస్తే డిమాండ్ కొంత మారినప్పటికీ, ఈ విభాగానికి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఇటీవల కాలంలో అప్‌డేట్ అయిన టాటా ఆల్ట్రోజ్ నుంచి ఈ కారుకు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఆల్ట్రోజ్‌లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఆప్షన్లు అందుబాటులో ఉండగా, మరోవైపు హ్యుందాయ్ i20 కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ సవాళ్లను తట్టుకుని కొత్త మోడల్ మార్కెట్లో ఏ విధంగా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు సెప్టెంబర్ 5న అధికారికంగా వెల్లడికానున్నాయి.