Reading Time: 2 minutes
Watch: ఏ బ్రాండ్‌ తాగావ్‌ బ్రో.. మటన్‌ కొట్టులో దూరిన కొత్త కస్టమర్‌ను మడతెట్టిన మందుబాబు!

లక్నో, ఆగస్ట్‌ 16: ఓ మాంసం దుకాణంలోకి భారీ కొండచిలువ ప్రవేశించడంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 15 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ దుకాణంలో ఉన్న మేకల వైపు వెళ్లింది. అయితే అది మేకను పట్టుకునేలోపే అక్కడ షాకింగ్‌ సీన్‌ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడోగానీ ఓ మందుబాబు మెరుపు వేగంతో దూసుకొచ్చి.. అమాంతం దాన్ని పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీలో శుక్రవారం (ఆగస్ట్ 14) రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీలో ఓ మటన్‌ కొట్టులో 15 అడుగుల భారీ కొండ చిలువ ప్రవేశించింది. అంతా భయంతో పరుగులు తీయడంతో సురేష్‌ అనే వ్యక్తి మాత్రం ఫుల్లుగా మందుకొట్టి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. మద్యం మత్తులో ఉన్నప్పటికీ కొండచిలువను చూసి ఏమాత్రం భయపడలేదు. ఏకంగా చేతులతోనే దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొండచిలువ నుంచి తప్పించుకునేందుకు సురేష్‌ చేతిని చుట్టుకుని బిగించడం ప్రారంభించింది. అంతేకాదు.. తప్పించుకునే ప్రయత్నంలో అతని చేతిపై ఒకట్రెండు సార్లు కాటు కూడా వేసింది. అయితే కొండచిలువలు విషపూరితమైనవి కాకపోవడంతో విషం ప్రమాదం ఉండదు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో కాటు వల్ల గాయాలు, ఇతర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కొండచిలువ బిగించినా సురేష్‌ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు దాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అంతేకాదు.. దాన్ని భుజాలపై వేసుకుని దండలా ధరించాడు. ఆ తర్వాత అందరి ముందే కొండచిలువతో ఆటలాడటం ప్రారంభించాడు.

ఈ విచిత్రమైన ఘటనను చూసేందుకు అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. స్థానిక దుకాణదారులు, రహదారిపై వెళ్తున్న వారు ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని వీక్షించారు. కొంతసేపు కొండచిలువతో ఆడుకున్న సురేష్‌.. చివరకు దాన్ని ఒక పెద్ద కంటైనర్‌లో సురక్షితంగా ఉంచాడు. ఆ తర్వాత ఆ కంటైనర్‌ను తీసుకెళ్లి కొండచిలువను ఓ డ్రైనేజీలో విడిచిపెట్టాడు. అక్కడి నుంచి వెళ్లే ముందు కొండచిలువ తన తలను సుమారు మూడు అడుగుల ఎత్తుకు పైకి ఎత్తి కొద్దిసేపు నిలిచింది. అనంతరం అక్కడి నుంచి జారుకుంటూ వెళ్లిపోయింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి భారీ వన్యప్రాణులను చేతులతో పట్టుకోవడం అత్యంత ప్రమాదకరం. పాములు విషపూరితం కాకపోయినా.. వాటి కాటు, బిగింపు వల్ల తీవ్ర గాయాలు కలిగే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి సందర్భాల్లో శిక్షణ పొందిన స్నేక్‌ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడం సురక్షితమైన మార్గం.