
గత ఐదు సంవత్సరాలుగా హరప్పా: గాడ్స్ సిటీ ఆఫ్ సివిలైజేషన్ నవల రాసే క్రమంలో మనదేశ ప్రజాస్వామ్యానికి ఈ దేశ ఉత్పత్తి, జీవన విధానానికి 5 వేల ఏండ్ల కింద హరప్ప నిర్మించిన నాగరికత, సైన్సు, టెక్నాలజీ, పశుపాలక జీవన విధానం ఇప్పటికీ పునాది. నిజానికి ఈ దేశ ఉత్పత్తి కులాలకు మూలం హరప్ప. ఇజ్రాయెల్ నిర్మించిన మానవ వనరులకు పునాది అబ్రహాం అని అక్కడి ప్రజలు ఎలా నమ్మారో ఈ దేశ మూలవాసులందరికీ హరప్ప పునాది. నేను చివరికి అష్టకష్టాల తరువాత పూర్తిచేసిన నవల అక్టోబర్ 13న అన్‌బౌండ్ స్క్రిప్ట్ అనే న్యూఢిల్లీ పబ్లిషర్ ఇంగ్లిషులో బయటకితెచ్చారు. దాని హిందీ వెర్షన్ కొద్ది రోజులలో బయటకి రాబోతుంది. ప్రఖ్యాత ప్రొఫెసర్ రతన్‌లాల్ (హిందూ కాలేజీ, ఢిల్లీ) దాన్ని ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించాడు.
ఈ నవలలో హరప్ప, ఆయన తండ్రి జాంభవ్, ఆయన తండ్రి మహీష హరప్ప భార్య మైసమ్మ, ఆయన తల్లి సింధ్, నాయనమ్మ పొచ్చాలు ఆరంభంలో ప్రధానపాత్ర పోషిస్తారు. వీరి జీవితం కోడిని, గొర్రెను, మేకను డొమెస్టికేట్ చేయడం. వాటిని ఆర్థిక వనరులు కుటుంబానికి, క్రమంగా గ్రామానికి మలచడంతో ప్రారంభమవుతుంది. వీరంతా పక్షులు, జంతువులు సైకాలజీని స్టడీ చేసి, వాటిని కుటుంబ ఆర్థిక వనరులుగా మలచడానికి పడిన సంఘర్షణ నవలలో కీలకపాత్ర పోషిస్తుంది. ఏనిమల్ ఎకానమీ నిర్మాణం చేయడానికి ప్రకృతిని, నీటి వనరులను జాగ్రత్తగా పరిశీలించి మనుషులుగా తమకు, తమ కుటుంబ పక్షి, జంతుజాలాలకు అనువైన ప్రదేశంలో గ్రామ నిర్మాణం చేస్తారు. అట్లా ఏనిమల్ ఎకానమీతో మొదట సింధూ నదీ తీరాన నిర్మించిన గ్రామం జంబూ ద్వీపం. ఇది ప్రధానంగా జాంభవుని, హరప్ప తల్లి సింధుల క్రియేటివిటీకి ప్రతీకై భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి గ్రామం.
వంట సైన్సు అభివృద్ధి
దాని బొడ్రాయి జాంభవ్ చనిపోయాక బొందపెట్టి దానిపై పెట్టిన రాతిపలక. ఆ పలకపైన అనూహ్య శక్తి ఏదో వచ్చి దేశంలో మొదట రూపొందిన అక్షరాల్లో ‘జంబూద్వీపం’ అని రాస్తుంది. అప్పటికే పోచ, సింధు తరాలు గొర్రె, మేకల నుంచి డొప్పల్లో పిండిన పాలు, క్రమంగా బండ పరుపుల బొక్కల్లో ఆ పాలు పోసి వేడి చేయడం కనుక్కుంటారు. పోచ ఈ దేశంలోని పాలు, పెరుగు ఆర్థిక వ్యవస్థకు పాలు పిండడం, వాటిని వేడి చేయడంతో దేశంలోని కిచెన్ విప్లవం ప్రారంభమౌతుంది. క్రమంగా ఆ కిచెన్ ఒక ప్రయోగశాలగా మారి పాలు, పెరుగుతోపాటు మాంసం వంటకాలు ఆరంభమవుతాయి. ఈ రెండు తరాలు గొర్రె, మేక, బర్రె మాంసంను కాల్చుకుని తినే స్థితి నుంచి మెత్తగా ఉడకబెట్టే స్థితికి ఈ స్త్రీలు వంట సైన్సును అభివృద్ధి చేస్తారు. పశు, పక్షి వేట, తినడానికి రకరకాల కాయలు, గడ్డలు, క్రమంగా బార్లీ ధాన్యాన్ని కనిపెట్టేపని జంబూద్వీప పురుషులు చేస్తుంటే, పశు, పక్షులు పోషణ జంబూద్వీప స్త్రీలు చేశారు.
హరప్ప సాధించిన మొదటి విజయం
హరప్ప పుట్టేనాటికి జాంభవ్ కుటుంబ గొర్రె, మేకల మంద చాలా పెద్దదవుతుంది. గొర్రె, మేకల పెంపకం (షప్పర్డింగ్) ప్రధాన గ్రామ ఆధారంగా మారుతుంది. ఆ గొర్రె గుంపుల పెద్దలు జాంభవ్, సింధులు, హరప్ప చిన్నప్పటినుంచీ గొర్ల కాపరి అవుతాడు. (అతని ఆకారం, రంగు, రూపు ఎలా ఉంటాయో అమెరికా నుంచి ప్రఖ్యాత పెయింటర్ ఇల్‌ట్రేటర్ వేసిన హరప్ప బొమ్మ చూస్తే అర్థమౌతుంది.) అప్పటివరకు కుటుంబ జంతువుగా మారని బలమైన బర్రె జాతిని డొమిస్టికేట్ చేయాలనే పట్టుదల హరప్పలో తన యవ్వన గొర్రెల కాపరి జీవితంలో ఎదురవుతుంది. నల్లటి బర్లు, దున్నపోతులను తప్పించుకు తిరుగుతున్న హరప్ప ఆఖరికి దాన్ని కూడా గొర్రె, మేకలాగ గ్రామ జంతువు చేయాలనే వీరత్వ కోరిక అతనిలో పెరుగుతూ పోతుంది. కానీ ఆ ప్రాంతపు బర్లు, సింహాలు, పులుల కంటే ప్రమాదకరమైనవని, వాటిని వేటాడి చంపడం జంబూద్వీప వీర యోధుని పనిగా గ్రామాల ప్రజలు భావిస్తున్న రోజులవి. బర్రె మాంసం అక్కడి ప్రజలకు అతిప్రీతి. ఆ మాంసం తరువాతే గొర్రె, మేక, కోడి మాంసం రుచి. అప్పటికే సింధు కోడిగుడ్డు తినొచ్చని కనిపెడుతుంది.
బర్రె డొమిస్టికేట్ అయ్యాక…
ఆ ప్రాంతాలలో, అంటే ఆనాటి ఈ దేశంలో ఆవులు, ఎద్దులు లేవు. తెల్ల జంతువులు ఈ దేశంలో ఆనాటికి కనిపించవు. వాళ్ల అందం కొలగీత బర్రె రంగు. చివరికి హరప్ప బర్రెను సాధుజంతువుగా మలచడానికి ఎటువంటి ఎత్తుగడలు వేశాడు. ఆ యుద్ధ కార్యాన్ని ఎలా సాధించాడు, బర్రె డొమిస్టికేట్ అయ్యాక జంబూద్వీప ఆర్థిక వ్యవస్థ ఎలా మారిపోయింది? నవల చదివి అనందించాల్సిందే. ఆనాడు హరప్పనుల యుద్ధం మహాభారతంలో జరిగినట్టు భూమి కోసం కాదు. లేదా స్త్రీపై సొంత పురుషాధిక్యత పెత్తనాన్ని ఏర్పాటుచేయడానికి రామాయణంలో యుద్ధం జరిగినట్టు కాదు. అది ప్రకృతిని బలమైన జంతువులను లొంగదీసుకుని జంబూద్వీప ఆర్థిక వ్యవస్థను మరోమెట్టుకు ఎదిగించడం కోసం. బర్రె డొమెస్టికేషన్ తరువాత కాలంలో హరప్ప భార్యగా మారిన మైసమ్మ వాననీటి కట్ట మడులను, తరువాత క్రమంగా కుంటలు నిర్మించడం, ఆమె అందం, తెలివి ప్రీతికాక్స్ బొమ్మల్లో నవల చదువుతూ తెలుసుకోవాల్సిందే.
ప్రపంచం మొదటి నగర నిర్మాణం
అభివృద్ధిచెందిన జంభూద్వీపంలోని తన ఇంట్లో మైసమ్మ పక్కలో పడుకుని ఉన్న హరప్ప కలలో కనిపించిన దేవుడు ఏం చెబుతాడు? అసలు దేవుడు అనే భావన జంబూద్వీపం హరప్పా నగరంగా మారేక్రమంలో ప్రజలలోకి ఎలా వచ్చాడు? ఇక్కడ సస్పెన్సే. ఈ ప్రపంచ మొదటి నగరాన్ని ఎలా ప్లాన్ చేశారు. (ఈ వ్యాసంలోని నవల కవర్ జాగ్రత్తగా చూడండి) కర్ర ఎవరు చెక్కారు? ఇటుక ఎవరు చేశారు? ఇండ్ల నిర్మాణం ఎలా జరిగింది? ఆ రోజుల్లోనే రాతి, మట్టిలోని ముడిపదార్థాలను బ్రాంజ్‌గా ఎలా మలిచారు? హరప్ప నిర్మాణం చారిత్రక దశను బ్రాంజ్ ఏజ్ అంటారని తెలుసు కదా! ఈ నగర నిర్మాణం తరువాత అబ్‌స్ట్రాక్ట్‌గా హరప్ప కలలోకి వచ్చిన దేవుడు ‘ఆది దేవుడు’ ఎలా సింధూ నది ప్రాంత ప్రజల ముందుకొచ్చాడు. అతని రూపమేంది, ఏం చేశాడు పాఠకులు ఊహించుకుని నవల చదవాల్సిందే. తరువాత ఆర్యులు ఎంతమంది వచ్చారు, ఏ పేరుతో వచ్చారు? ఏయే జంతువులు, ఆయుధాలతో వచ్చారు? ఏయే ఎత్తుగడలతో వచ్చారు, ఏమి చేశారు? ఆది దేవునికి, ఆర్యులకు ఎటువంటి సంబంధం ఏర్పడింది? నవల కథలోకి పోవలసిందే. అసలు ఈ నవలలోని కథంతా, ఎవరికి ఎవరు చెప్పారు. నవల ఎలా ప్రారంభమౌతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనే ప్రశ్నలకు సమాధానమేంటో వ్యాసం చదివేవారికి తెలవాలంటే చదవాల్సిందే.
నా ఒక్కడి పాత్ర మాత్రమే లేదు
ఈ కథారూపం, భాష పరిపక్వత, చాప్టర్ల టైటిల్స్ ఫైనల్ రూపానికి తేవడానికి నా ఒక్కడి పాత్ర మాత్రమే లేదు. సుదీర్ఘ కాలంగా ఫోన్లమీద, జూమ్ మీటింగులలో బిను మాథ్యూ (కౌంటర్ కరంట్ ఎడిటర్), సత్యసాగర్ (జర్నలిస్టు, ట్రావెల్ రైటర్) శ్రీకాంత్ చింతల (తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్) ఇంకా ముఖ్యంగా ప్రీతి గులాటి కాక్స్, ఆమె భర్త స్టాన్‌కాక్స్, ( అమెరికా నుంచి) కీలకమైన పాత్ర పోషించారు. దీని ఇంగ్లిష్ ఎడిటింగ్ శిల్ప్ (స్కాలర్ ఎడిటర్) స్వయంగా హరప్పన్ బ్యాక్‌గ్రౌండ్ రీత్యా గుంపు మెదళ్ల సంఘర్షణ ఈ నవల. ‘అంటరాని దేవుడు’ (అన్‌టచ్‌బుల్ గాడ్) తరువాత ఇది నా రెండో నవల. దాని శక్తి గురించి క్లుప్తంగా ఆన్‌లైన్‌లో చూడాలంటే అమెజాన్‌లో బుక్ కింద కొంతమంది వ్యాఖ్య ఉంటుంది చదవండి. ఈ నవల ఇంతవరకు మన దేశంలో, బయటి దేశాల్లో వచ్చిన నవలల కంటే పూర్తిగా భిన్నమైంది. ఇది 14 ఏండ్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లందరు చదవవచ్చని అమెజాన్ చెబుతున్నది. నవలలో వేసిన బొమ్మలు నేను నవల రాసేకంటే ఎక్కువగా హరప్పా సంస్కృతి నాటి వివిధ కళారూపాలను బాగా అధ్యయనం చేసి ప్రీతి వేసింది. పైన పేర్కొన్నవారందరికీ నా కృతజ్ఞతలు.
– ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.