
రైతులు పండించే సన్న వడ్లకు బోనస్ అందించే పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంపిక చేసిన సన్నవరి రకాలకే బోనస్ అందిస్తారు. ఈ మేరకు ఏడు రకాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ రకం వరి సాగు చేసినవారికే క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్న బియ్యం రకాలను సాగు చేసినవారికి మద్దతు ధరలతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ జమ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు లాభం జరిగే అవకాశముంది. దీని వల్ల సన్న బియ్యం సాగు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం 7 రకాలను ఎంపిక చేసింది. నిబంధన ప్రకారం ఈ రకాల సన్న బియ్యంను పండించినవారికి బోనస్ జమ చేస్తారు.
లబ్దిదారుల ఎంపిక ఎలా అంటే..?
ఈ-క్రాప్ ఆధారంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. రైతులు నెల రోజుల్లోగా తమ పంట వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. సన్న బియ్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు నాణ్యమైన సన్న బియ్యం సాగు వైపు ఆసక్తి చూపుతారనే ఉద్దేశంతో దీనిని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని విధివిధానాలను విడుదల చేసింది. తాజాగా కేబినెట్ వీటికి ఆమోదం తెలపడంతో అధికారికంగా అమల్లోకి రానుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సన్న బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సేకరణలో వీటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఏడు రకాలను ప్రభుత్వం గుర్తించి రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంంది.
69.89 లక్షల ఎకరాల్లో సాగు
2025లో రాష్ట్రవ్యాప్తంగా 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. 43.51 లక్షల ఎకరాల్లో సన్న బియ్యం పండించారు. ఇక 26.38 లక్షల ఎకరాల్లో ముతక రకాల సాగు చేపట్టగా.. మొత్తం విస్తీర్ణంలో 62 శాతం సన్న బియ్యం సాగు జరిగింది. గత ఏడాది 33 సన్న బియ్యం రకాలను ప్రభుత్వం గుర్తించగా.. వీటిల్లో 7 రకాలే 27.95 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ రకాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈ రకాలను పరిశీలించి రైతుల ఆదాయాన్ని పెంచుతాయని గుర్తించింది. ఈ ఏడు రకాల్లో బీపీటీ 5204, ఆర్‌ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 రకాలు ఉన్నాయి. ఈ రకాలను పండించిన వారిక మద్దతు ధరలో సంబంధం లేకుండా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.