Reading Time: 2 minutes

విద్యార్థులకు  కార్పొరేట్ స్థాయి విద్య.. మెదక్‌‌, నర్సాపూర్‌‌కు రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌‌ స్కూల్స్‌‌: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.
  • మెదక్‌‌, నర్సాపూర్‌‌కు రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌‌ స్కూల్స్‌‌: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రామాయంపేటలో రూ.200 కోట్లతో యంగ్‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌
  •     మెదక్‌‌ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
  •     80వ స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి

మెదక్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందులో భాగంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెదక్‌‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో శాఖల వారీగా జరిగిన ప్రగతిని మంత్రి వివరించారు. విద్యా ప్రగతిలో భాగంగా రామాయంపేటలో రూ.200 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ స్కూల్‌‌ను 2,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యంతో నిర్మిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 120 ప్రైమరీ స్కూల్స్‌‌లో 1,417 మంది విద్యార్థులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని వెల్లడించారు. 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మరమ్మత్తు పనుల కోసం రూ.3.26 కోట్లు మంజూరు చేశామని వివరించారు. సొంతిల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. జిల్లాలో మొదటి విడతలో రూ.447 కోట్లతో 8,955 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 7,382 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని, వాటిలో 4,353 ఇండ్ల నిర్మాణం పూర్తి కావొచ్చిందని వివరించారు. ఇండ్ల నిర్మాణ ప్రగతిని బట్టి ఇప్పటి వరకు 6,309 మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో రూ.163 కోట్లు జమ చేశామని చెప్పారు. 

భూముల రీసర్వేలో మెదక్‌‌ ఫస్ట్‌‌ ప్లేస్‌‌..

భూముల రీసర్వేలో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం అభినందనీయమని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. మొదటి విడతలో 10 గ్రామాలు, రెండో విడతలో 70 గ్రామాల్లో భూముల రీ సర్వే చేపట్టగా, అభ్యంతరాల స్వీకరణ తర్వాత వాటిని నివృత్తి చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో కాటేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు, మెదక్ ఖిల్లా అభివృద్ధికి రూ. 54 లక్షల చొప్పున మంజూరు చేసినట్టు చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా జిల్లాలోని 20 మండల సమాఖ్యలకు రూ.7.20 కోట్లతో 20 బస్సులు కొనుగోలు చేసి అందజేశామన్నారు.

గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 2026–-27 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీ ద్వారా 12 వేల మహిళా సంఘాలకు రూ.610 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 1,819 సంఘాలకు రూ.145 కోట్ల రుణాలు అందించి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాడు అందించామని వివరించారు. మెప్మా ద్వారా మున్సిపల్ పట్టణాల్లో 134 మహిళా సంఘాలకు రూ.18.27 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. అలాగే 854 మహిళా సంఘాలకు రూ.3.9 కోట్ల వడ్డీ లేని రుణాలు కూడా అందించామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 50 వ్యక్తిగత యూనిట్లకు రూ.98 లక్షల రుణాలు అందించామని తెలిపారు. ఎంప్లాయ్‌‌మెంట్‌‌ గ్యారంటీ స్కీమ్‌‌ (ఈజీఎస్) ద్వారా 1,086 పనులకు రూ.98.51 కోట్లు మంజూరయ్యాయని, వాటిలో 271 పనులు పూర్తిచేయగా, 438 పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. ఎస్‌‌డీఎఫ్‌‌లో 219 అభివృద్ధి పనులు మంజూరు కాగా, 42 పనులు పూర్తి దశలో ఉండగా, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. 

14.30 లక్షల మొక్కలు నాటినం.. 

వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు14.30 లక్షల మొక్కలు నాటినట్టు మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరచిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ స్కూల్‌‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రి వివేక్​ వెంకట్​ స్వామి విద్యార్థుల వద్దకు వెళ్లి మెమెంటోలు అందజేసి అభినందించి, వారితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్ పాల్గొన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.