Reading Time: 3 minutes

ఈ రేషన్ కార్డు మీ ఆత్మగౌరవం ఇకపై ఆరు నెలలకోసారి ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.
  • నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయలో 
  • పడకుండా పరీక్షలకు సిద్ధం కావాలి
  • రాష్ట్రమంతా సన్నబియ్యం, ఇందిరమ్మ 
  • ఇండ్ల గురించి మాట్లాడుతున్నరు
  • రెండేండ్లలో 7 లక్షల ఇండ్లు మంజూరు.. 
  • ప్రతీ గ్రామంలో నిర్మాణం చేస్తాం
  • అప్పు లేని రైతులు తెలంగాణలోనే ఎక్కువ
  • కేంద్ర ప్రభుత్వ నివేదికలు 
  • బీజేపీ నాయకులకు కనిపించట్లే!
  • రైతులకు ఎవరేం చేశారో చర్చించేందుకు 
  • కేసీఆర్ ​అసెంబ్లీకి రావాలని సవాల్
  • సంగారెడ్డిలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన సీఎం

రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డు అనేది కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే కాదు.. ఇది ప్రజల ఆత్మగౌరవం. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే కార్డు. రేషన్‌‌‌‌‌‌‌‌ అనే వ్యవస్థను ప్రారంభించిందే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ. ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకొని పేదలకు మేం సంక్షేమాన్ని అందిస్తున్నాం.- సంగారెడ్డి సభలో సీఎం రేవంత్​రెడ్డి

సంగారెడ్డి, వెలుగు: ‘రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్ కార్డు కేవలం ఒక కాగితం మాత్రమే కాదు.. ఇది మీ ఆత్మగౌరవం’ అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన అన్నారు. రాష్ట్రంలో ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం ప్రకటించారు. నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయలో పడకుండా పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ గురించే మాట్లాడుకుంటున్నారని సీఎం చెప్పారు. ‘ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో ఉండదు.  రెండేళ్లలో 7 లక్షల ఇండ్లు మంజూరు చేసినం..  ప్రతీ గ్రామంలో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నాం’ అని అన్నారు. అప్పు లేని రైతులు తెలంగాణలోనే ఎక్కువ ఉన్నారని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టంచేస్తున్నా అవి బీజేపీ నాయకులకు కనిపించకపోవడం శోచనీయమన్నారు.

‘బీజేపీ, బీఆర్ఎస్ రెండూ వేర్వేరు పార్టీలు కాదు.. అవి నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివే’ అని సీఎం రేవంత్​ఎద్దేవా చేశారు. ‘ఈ వేదికపై నుంచి నేను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్న.. ఏనాడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని మీరు ఆలోచించారా? సన్నబియ్యం ప్రతీ పేద ఇంటికి చేరుస్తున్న ఘనత మా ప్రభుత్వానిది’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్​ఉండదని ఆనాడు మాట్లాడారు.. ఈ 32 నెలల్లో ఒక్క గంటైనా కరెంటు పోయిందా?  ప్రతీ పల్లెలో  రైతులకు 24 గంటల ఉచిత కరెంట్​అందిస్తున్నది నిజం కాదా?’ అని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వంపై కొంతమంది అఘోరా పూజలు, చేతబడులు చేయిస్తున్నారని రేవంత్ విమర్శించారు. ‘ఎవరైనా ప్రజలపై చేతబడులు చేయిస్తారా? నిజాలు చెబితే మా మహేశ్​గౌడ్‌‌కు నోటీసులు ఇస్తున్నరు. అడుగు తీసి అడుగు పెడితే చాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లు.. తమిళనాడులో గుడులకు వెళ్లిన విషయం ఎందుకు రహస్యంగా ఉంచారు? వాళ్లు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం మనపైనే ఉంది. అందుకే ఎల్‌‌నినో కరువులోనూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండింది. దేవుడి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా మా పార్టీకి ఉండాలని కోరుతున్నా’ అని సీఎం రేవంత్ అన్నారు.

రాష్ట్రంలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం

గడిచిన రెండున్నరేళ్లలో ప్రజా ప్రభుత్వం 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను  భర్తీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో పది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. ‘నిరుద్యోగ యువకులు మాయ మాటలు చెప్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు.. ప్రతీ ఆరు నెలలకోసారి ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాది. మాటిస్తే మట్టిలో కలిసే వరకు నిలబడే నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వానిది’ అని రేవంత్ చెప్పారు. ‘దుర్మార్గులు రాజకీయం కోసం.. అధికారం కోసం కుట్రలు చేస్తున్నారు.. వారి మాయలో పడకండి.. పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి.. మీ హక్కులను కాదనం.. అవకాశాలను తొలగించం.. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తూ ముందుకు వెళుతున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి.’ అని కోరారు.

రైతులను రాజులుగా గౌరవించే ప్రభుత్వం

రైతులను రాజులుగా గౌరవించే సంస్కృతి తమ ప్రభుత్వంలో ఉందని సీఎం రేవంత్ అన్నారు. రెండున్నరేళ్లలో రైతులకోసం లక్షా 70 వేల కోట్లు  ఖర్చు చేశామని చాలా గర్వంగా చెబుతున్నాని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 వేల కోట్లు ఖర్చు చేసి రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామన్నారు. అప్పు లేని రైతులు తెలంగాణలోఎక్కువగా ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు బీజేపీ నాయకులకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ‘ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడారు.. కానీ సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్న వాస్తవం మీ కళ్ల ముందున్నది. రైతు భరోసా స్కీంలో రూ.2 వేలు పెంచి ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం ద్వారా రూ.36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం. ఇది మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కాదా?’ అని రేవంత్ నిలదీశారు. ఈ వేదిక నుంచి మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా.. ‘రైతులకు మేం చేసిన మేలు ఏంటో.. మీరు చేసిన అన్యాయం ఏంటో చర్చిద్దాం రండి..’ అని అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు రాష్ట్రంలో లేదు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నేను మీ తమ్ముడిగా ఏడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశానని రేవంత్ అన్నారు. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ‘ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు.. ఉండదు’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు ఏ ఒక్కరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ‘ఒంటరి మహిళలందరికీ పెన్షన్లు ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది. చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తాం. అర్హులందరూ దరఖాస్తు చేసుకోండి. పెన్షన్లు అందించే బాధ్యత మాది’ అని రేవంత్ హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ రాముడైతే 
జగ్గన్న హన్మంతుడు!

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ రాముడు అయితే జగ్గన్న హనుమంతుడి లాంటివాడని రేవంత్ అన్నారు. ఆ రాముడి మాట ఈ హనుమంతుడు ఎప్పుడూ జవదాటడని చెప్పారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేయాలో వద్దో అనేది ఆయన చేతిలో కూడా లేదు.. అది రాహుల్ గాంధీ చేతిలోనే ఉందని చెప్పారు. రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరని అన్నారు. ‘ఎన్నికల్లో ఓడినా కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారు.. తెలంగాణలో జగ్గారెడ్డి లాంటి నాయకుడు లేడు.. అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి.. ఆయనకు మీరు అండగా నిలబడాలి’ అని ప్రజలను సీఎం రేవంత్​ కోరారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, ఫహీం, గిరిధర్ రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.