Reading Time: < 1 minute

కిటకిటలాడిన వేములవాడ.. ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

Caption of Image.

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆరుద్ర నక్షత్రం, చతుర్థశి సోమవారం రావడంతో పాటు ఆషాఢమాసం ప్రారంభం అవుతుండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు. వేములవాడ ఎమ్యెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 265 అభిషేకాలు జరుగగా, సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.

ఆలయ సంస్కృతి, శైవాగమం శిక్షణ ప్రారంభం

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో  భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ‘దేవాలయ సంస్కృతి శైవాగమం – పరిపాలన’ శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి చిలకపాటి విజయరాఘవాచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

దేవాదాయ శాఖ నియమ నిబంధనలు, ఉద్యోగుల విధులు, బాధ్యతలు, క్రమశిక్షణ, ఆలయ పరిపాలనలో పాటించాల్సిన విధానాలను వివరించారు. అలాగే శైవాగమ శాస్త్రాల ప్రాముఖ్యత, ఆలయ సంప్రదాయాలు, ఆగమ విధానాల ప్రకారం దేవాలయ నిర్వహణ, పూజా విధానాల విశిష్టతపై  అవగాహన కల్పించారు.

©️ VIL Media Pvt Ltd.