అగ్రిటెక్ ఆవిష్కరణపై విదేశీ ప్రతినిధుల అధ్యయనం

- ఐసీఏఆర్ నార్మ్‌ను విజిట్ చేసిన 24 దేశాల సభ్యులు
- ఎ–ఐడియా ఇంక్యుబేషన్ విధానంపై అవగాహన
- భారత అగ్రికల్చర్ స్టార్టప్‌ల పురోగతిపై ప్రశంసలు
గండిపేట, వెలుగు: భారతదేశ అగ్రిటెక్ ఆవిష్కరణల వ్యవస్థ, వ్యవసాయ రంగంలోని స్టార్టప్‌ల పురోగతిని పరిశీలించేందుకు 24 దేశాలకు చెందిన 46 మంది అంతర్జాతీయ ప్రతినిధుల బృందం సోమవారం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ నార్మ్‌ను సందర్శించింది. నార్మ్‌కు చెందిన టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ‘ఎ–ఐడియా’ ఈ బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇక్రిశాట్ నిర్వహిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి కోసం వ్యవసాయంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను పెంపొందించడం’ అనే అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరిగింది. అల్జీరియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, కెన్యా, శ్రీలంక, నేపాల్, నైజీరియా, మారిషస్, క్రొయేషియా, ఒమన్, ఉజ్బెకిస్తాన్, జాంబియా తదితర 24 దేశాలకు చెందిన వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్–నార్మ్ ప్రధాన శాస్త్రవేత్త, ఎ–ఐడియా సీఈఓ డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణ, ఆవిష్కరణల ఆధారిత వ్యవసాయ అభివృద్ధికి ఎ–ఐడియా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ పూజ ఎస్. భట్ ఆధ్వర్యంలో స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన వినూత్న ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రతినిధులకు ప్రదర్శించారు.
దేశాల పరప్పర సహకారం..
ఐసీఏఆర్-నార్మ్ డైరెక్టర్, ఎ-ఐడియా అధ్యక్షుడు డాక్టర్ రామన్ మీనాక్షి సుందరం మాట్లాడుతూ.. సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల నిర్మాణంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. వ్యవసాయ రంగంలోని ఉమ్మడి సవాళ్ల పరిష్కారానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు పరస్పర సహకారం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతినిధులు నార్మ్, ఎ-ఐడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సమావేశంలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.