Reading Time: < 1 minute
Should You Walk After A Meal Right Time Benefits And Expert Tips

Health Tips: భోజనం చేసిన తర్వాత కాసేపు నడవాలని చాలా మంది చెబుతుంటారు. ఇలా చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న తర్వాత 15  నిమిషాల తర్వాత నడిస్తే జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే, తిన్న వెంటనే నడవొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

షుగర్ నియంత్రణ, జీర్ణక్రియకు సహాయం:

భోజనం ముగిసిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా నడవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మితమైన వేగంతో 10 నుంచి 20 నిమిషాలు నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, భోజనం తర్వాత తేలికపాటి నడక చేయడం వల్ల శరీరం గ్లూకోజ్‌ను మెరుగ్గా వినియోగించుకుంటుంది. దీని వల్ల భోజనం తర్వాత శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరగకుండా నియంత్రిస్తుంది.

ఎలా నడవాలి.?

భోజనం చేసిన 10-15 నిమిషాల తర్వాత నడక ప్రారంభించాలి. నెమ్మదిగా లేదా మితమైన వేగంతో నడవాలి. వెంటనే పరుగులు, అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేయొద్దు. మోకాళ్లు, పాదాలపై ఎఫెక్ట్ పడకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి. బ్యాలెన్సుడ్ ఫుడ్, తగిన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తిన్న తర్వాత నడకను అలవాటు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

తిన్న వెంటనే అతి వ్యాయామం చేయొద్దు:

ఆహారం తిన్న కాసేపటి తర్వాతే నడక ప్రారంభిస్తే మంచిది. తిన్న వెంటనే నడిస్తే మన జీర్ణక్రియకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణక్రియ కోసం శరీరం ఎక్కువ రక్తప్రసరణను జీర్ణవ్యవస్థకు పంపిస్తుంది. అదే సమయంలో వేగంగా నడవడం, పరుగులు పెట్టడం, అధిక శ్రమతో కూడి వ్యాయామం చేస్తే కండరాలకు ఎక్కువ రక్త ప్రసరణ చేయాల్సి వస్తుంది. దీంతో జీర్ణ క్రియపై ప్రభావం పడుతుంది. భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, వికారం వంటివి కలుగుతాయి.