Reading Time: < 1 minute
Kris Srikkanth Criticizes Ravi Bishnoi Selection India Vs England 2nd T20i

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌ (XI)లోకి తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 17వ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చెలరేగి 29 పరుగులు రాబట్టాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అంతిమంగా ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాలపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఘాటుగా స్పందించారు. బిష్ణోయ్ వేసిన ఆ 17వ ఓవర్ అత్యంత పేలవంగా సాగిందని, బెథెల్ అతడిని ముక్కలు ముక్కలు చేశాడని శ్రీకాంత్ అన్నారు. ఆ ఓవరే భారత్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకుందని విమర్శించారు.

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున బిష్ణోయ్ కనీసం సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదని, అలాంటి ఆటగాడిని నేరుగా జట్టులోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆటగాళ్ల పాత రికార్డులను చూసి ఎంపిక చేయడం సరికాదని, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని హితవు పలికారు.

కుల్దీప్ యాదవ్ ప్రస్తావన.. 
కుల్దీప్ యాదవ్ ఇటీవల ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించడం సరైనదేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అయితే, బిష్ణోయ్ కంటే కుల్దీప్‌ను కనీసం స్క్వాడ్‌లోనైనా ఉంచి ఉండాల్సిందని పేర్కొన్నారు.

ఇంగ్లాండ్ పిచ్‌ల వాతావరణ పరిస్థితులకు ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు సరిపోతారని.. బిష్ణోయ్‌కు బదులుగా యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్ కు అవకాశం ఇచ్చి ఉంటే జట్టు సమతుల్యత బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. బిష్ణోయ్ కేవలం భారత పిచ్‌లపైనే ప్రభావం చూపగలడని తేల్చి చెప్పారు.