సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవం వచ్చేసింది అప్పట్లో మనం చుసిన రజని కాంత్ మూవీ రోబోలో చిట్టి అందరికి గుర్తువుండే ఉంటుంది. ఇప్పుడు మనుషులతో కలిసి మెలిసి జీవిస్తూ, మన నిత్యకృత్యాల్లో తోడుగా ఉండేందుకు చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ‘యూబీటెక్’ (UBTech) ‘UWORLD U1’ అనే అద్భుతమైన హ్యూమనాయిడ్ రోబోను మార్కెట్లోకి తెచ్చింది. ఫ్యాక్టరీల కోసం కాకుండా కేవలం మన ఇళ్లలో మనకు స్నేహితుడిలా భావోద్వేగాలను పంచుకునేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లాంచ్ అయిన మొదటి రోజే ఏకంగా 13 వేలకు పైగా ఆర్డర్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ స్మార్ట్ రోబో హైలైట్స్ మరియు విశేషాలు ఇప్పుడు చూద్దాం..
అచ్చం మనిషి లాగే ఉంటుంది: ఈ U1 రోబోట్ మగ, ఆడ రెండు రూపాల్లో అందుబాటులో ఉంది. మగ రోబో 183 సెం.మీ ఆడ రోబో 168 సెం.మీ ఎత్తుతో ఉంటాయి. దీనికున్న 88 సర్వో జాయింట్ల వల్ల ఇది మనుషులలాగే చాలా సహజంగా కదలగలదు. ఇక దీనిపై ఉన్న సిలికాన్ చర్మం వల్ల ముఖ కవళికలు అచ్చం మనిషిలాగే కనిపిస్తాయి.
మనసును అర్థం చేసుకునే ఎమోషనల్ ఏఐ: U1 రోబోట్ ప్రత్యేకత దీనిలోని ఎమోషనల్ ఏఐ సిస్టమ్. ఇది మనుషుల్లోని 20కి పైగా భావోద్వేగాలను సులభంగా గుర్తించగలదు. ఇక మనం మాట్లాడుతున్నప్పుడు కళ్లలోకి చూస్తూ మాట్లాడటం, పాత విషయాలను గుర్తుంచుకుని మరీ సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత.

క్షణాల్లో స్పందన.. పిలవకుండానే సాయం: మనం మాట్లాడే మాటలకు, దీని పెదవుల కదలికలకు మధ్య కేవలం 20 మిల్లీసెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అంటే అంత వేగంగా ఇది స్పందిస్తుంది. అంతేకాదు, మనం పిలవాల్సిన అవసరం లేకుండానే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి స్వయంచాలకంగా మనకు సాయం చేయడానికి ముందుకు వస్తుంది.
మీ డేటా భద్రం.. నో టెన్షన్: సాధారణంగా ఏఐ డివైజ్‌ల వల్ల డేటా లీక్ అవుతుందేమో అని అందరికీ భయం ఉంటుంది. కానీ దీని కోసం యూబీటెక్ సంస్థ ‘లోకల్-ఫస్ట్’ ప్రాసెసింగ్‌ను వాడింది. దీనివల్ల మీ పర్సనల్ డేటా క్లౌడ్‌లోకి వెళ్లకుండా నేరుగా రోబోలోనే సేఫ్‌గా నిక్షిప్తమవుతుంది.
ఎవరెవరికి ఉపయోగపడుతుంది?: ఈ రోబో కేవలం ఒక యంత్రం కాదు, ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధుల సంరక్షణకు, పిల్లల విద్యకు, హోటళ్లలో ఆతిథ్యానికి మరియు ప్రీమియం గృహ సేవల్లో ఒక మంచి స్నేహితుడిగా అద్భుతంగా పని చేయగలదు.
ఇక ఒకప్పుడు కేవలం సినిమాల్లోనే చూసిన రోబోలు ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మనుషులకు తోడుగా, భావోద్వేగాలను పంచుకుంటూ సాయపడే ‘UWORLD U1’ రోబో రాకతో భవిష్యత్తులో మన జీవనశైలి పూర్తిగా మారిపోబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
గమనిక: జూన్ 30న షెన్‌జెన్ నగరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ రోబోను అధికారికంగా ప్రదర్శించారు. సాంకేతికతపై ఆసక్తి ఉన్నవారిని ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.
The post స్మార్ట్ AI రోబోట్ లాంచ్… యూ వరల్డ్ హైలైట్స్ ఇవే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.