Reading Time: 2 minutes
Ys Jagan Hey Ram Save Andhra Pradesh Criticism

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకరమైన ధోరణిలో నడుస్తోందని ఆరోపిస్తూ.. “హే రామ్.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారని, ఇది రాజ్యాంగ హక్కులపై , ప్రజాస్వామ్య విలువలపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. ఏపీకి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యమో, జంగిల్‌ రాజో కాదని, ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలని జగన్ స్పష్టం చేశారు.

శాంతిభద్రతల వైఫల్యం.. నేరాలపై అలసత్వం

రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటినా ఆచూకీ కనుగొనలేకపోయారని, పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడమే కాకుండా, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో సాయికృష్ణ లాకప్‌డెత్ , శవం మాయం కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్ వంటి ఘటనలు పోలీసు వ్యవస్థకే తలవంపులు తెచ్చాయని మండిపడ్డారు.

సోషల్ మీడియా యాక్టివిస్టులపై అణచివేత

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని జగన్ ధ్వజమెత్తారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిరోజూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులపై బెయిల్ రాని నాన్‌-బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలని ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు హుకుం జారీ చేశారని ఆరోపించారు. ఉస్మానియా గోల్డ్‌మెడలిస్ట్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను హైదరాబాద్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, యూట్యూబర్ రావణ్‌కు నాలుగు కోర్టుల్లో బెయిల్ వచ్చినా అసహనంతో పోలీస్ స్టేషన్లపై దాడులు చేయించి తీవ్రవాద అభియోగాలు మోపడం దుర్మార్గమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేసిన విమర్శలనే ఇప్పుడు ఇతరులు చేస్తుంటే వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారని, రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థే రాష్ట్రానికి కావాలని జగన్ డిమాండ్ చేశారు.