
సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas LLP) జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా తమ వద్దే ఉంచుకుందని వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) తేల్చింది. ఈ నేపథ్యంలో ఏఎంబీ సినిమాస్ రూ.1.1 కోట్లు రాష్ట్ర, కేంద్ర వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. అలాగే తెలంగాణలోని మరో ఐదు థియేటర్లపైనా కూడా చర్యలు తీసుకున్న ట్రైబ్యునల్, మొత్తం ఆరు థియేటర్లు కలిసి దాదాపు రూ.1.7 కోట్లు కేంద్ర, తెలంగాణ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్లలో జమ చేయాలని ఆదేశించింది.
జనవరి 1, 2019 నుంచి సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ, ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా థియేటర్లు టికెట్ ధరలను దాదాపు యథాతథంగా కొనసాగించాయని ట్రైబ్యునల్ గుర్తించింది. తుది టికెట్ ధర తగ్గించాల్సిన బదులు, బేస్ టికెట్ ధరలను పెంచడం ద్వారా జీఎస్టీ తగ్గింపు వల్ల వచ్చిన లాభాన్ని థియేటర్లే పొందాయని పేర్కొంది.
AMB సినిమాస్ LLP రూ.35 లక్షలు..
2026 జూన్ 11న వెలువడిన తాజా ఉత్తర్వుల్లో AMB సినిమాస్ LLP రూ.35 లక్షలు జమ చేయాల్సి ఉంది. విశ్వనాథ్ సినిమా హాల్ 70MMకు రూ.9 లక్షలు డిపాజిట్ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇతర థియేటర్లలో జ్యోతి థియేటర్ కు రూ.19.8 లక్షలు, భ్రమరాంబ సినిమాస్ కు రూ.11.8 లక్షలు, ASR సినిమా LLPకు రూ.9.6 లక్షలు, కుమార్ 70MM కు రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ట్రైబ్యునల్‌ను మెప్పించలేకపోయిన AMB సినిమాస్..
AMB సినిమాస్‌కు సంబంధించిన కేసులో జీఎస్టీ తగ్గింపు వల్ల పొందిన అదనపు లాభాన్ని ట్రైబ్యునల్ రూ.1.1 కోట్లుగా నిర్ధారించింది. ఇందులో సంస్థ గతంలో స్వచ్ఛందంగా జమ చేసిన మొత్తాన్ని సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. తమకు టికెట్ ధరలను పెంచుకునేందుకు న్యాయపరమైన అనుమతులు ఉన్నాయని, అలాగే నిర్వహణ వ్యయాలు కూడా గణనీయంగా పెరిగాయని ఏఎంబీ సినిమాస్ వాదించింది.
అయితే ఈ వాదనలను ట్రైబ్యునల్ తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఉన్నప్పటికీ, అవి కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలకు మినహాయింపు ఇవ్వవని స్పష్టం చేసింది. జీఎస్టీ రేటు తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనాన్ని తప్పనిసరిగా వినియోగదారులకు అందించాల్సిందేనని ట్రైబ్యునల్ పేర్కొంది.
Section 171 నిబంధనలు ఉల్లంఘన..
ట్రైబ్యునల్ ప్రకారం, ఈ థియేటర్లు కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం యొక్క సెక్షన్ 171లోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించాయి. జీఎస్టీ రేట్లు తగ్గినప్పుడు లేదా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పెరిగినప్పుడు, ఆ ప్రయోజనాన్ని వస్తువులు లేదా సేవల ధరలను తగ్గించడం ద్వారా నేరుగా వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది.
అయితే, సంబంధిత థియేటర్లు అలా చేయకుండా బేస్ టికెట్ ధరలను పెంచి, తుది ధరను యథాతథంగా ఉంచినట్లు ట్రైబ్యునల్ నిర్ధారించింది. దీంతో జీఎస్టీ తగ్గింపు వల్ల లభించిన ప్రయోజనం ప్రేక్షకులకు కాకుండా థియేటర్లకే దక్కిందని GSTAT స్పష్టం చేసింది.
18 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు..
ట్రైబ్యునల్ విశ్వనాథ్ సినిమా హాల్ 70MM, ASR సినిమా LLP, కుమార్ 70MMలకు 2019 జూన్ 28 నుంచి 18 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అయితే బ్రహ్మరాంబ సినిమా విషయంలో వడ్డీ విధించలేదు. అలాగే ఎక్కువశాతం థియేటర్లు చెల్లించే మొత్తాన్ని సమానంగా కేంద్ర వినియోగదారుల సంక్షేమ నిధి మరియు తెలంగాణ వినియోగదారుల సంక్షేమ నిధికి పంచాలని ట్రైబ్యునల్ సూచించింది.
అయితే ఈ కేసుల్లో ఎలాంటి జరిమానాలు విధించలేదు. ఎందుకంటే ఈ ఉల్లంఘనలు 2020 జనవరి 1కు ముందే జరిగాయి. జరిమానాలకు సంబంధించిన నిబంధనలు ఆ తేదీ తర్వాతే అమల్లోకి వచ్చాయని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.