
Pawan Kalyan Meets Devendra Fadnavis: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు తూర్పు కనుమల్లో పులుల సంరక్షణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులను అందించేందుకు అంగీకరించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని, ఈ నేపథ్యంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
రెండు ఆడ పులుల రాకతో తూర్పు కనుమల్లో అంతరసంతానోత్పత్తి (ఇన్‌బ్రీడింగ్) సమస్యలు తగ్గి, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల జనాభా దీర్ఘకాలికంగా స్థిరపడుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భాగస్వామ్యం తూర్పు కనుమల్లో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Had a warm and productive meeting with the Hon’ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for… pic.twitter.com/k6Vc4GADUd
— Pawan Kalyan (@PawanKalyan) June 30, 2026