Reading Time: 2 minutes
Ind Vs Eng 1st T20 : వైభవ్  డెబ్యూపైనే అందరి కళ్లు.. ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే

Ind Vs Eng 1st T20 : ఐర్లాండ్ చేతిలో తగిలిన ఊహించని దెబ్బ నుంచి కోలుకుని, ఇంగ్లాండ్‌తో జరగబోయే టి20 సిరీస్‌లో ఎలాగైనా విజయకేతనం ఎగరేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ పర్యటనలో అందరి దృష్టి 15 సంవత్సరాల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూ పైనే ఉంది. ఐర్లాండ్ టూర్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితమైన వైభవ్‌కు ఈసారి ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి టి20 మ్యాచ్‌లోనే ఆడే అవకాశం లభిస్తుందని క్రికెట్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం తీవ్రమైన ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోంది. శాంసన్ ఐర్లాండ్‌పై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, ఒకసారి గోల్డెన్ డక్‌గా వెనుతిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు.

మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రదర్శన కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి అతను చేసినవి కేవలం 13 పరుగులు మాత్రమే. దీనితో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానానికి కూడా ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. ఇకపోతే, ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టి20 బ్యాటర్‌గా దూసుకుపోతున్న అభిషేక్ శర్మపైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. పవర్‌ప్లేలో జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చే బాధ్యతను అతను మోయనున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే 49 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి అభిషేక్ శర్మ తన హిట్టింగ్ పవర్‌ను నిరూపించుకున్నాడు.

ఈ సిరీస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఒక అగ్నిపరీక్ష లాంటిది. భారత జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆడిన మొదటి రెండు టి20 మ్యాచ్‌లలోనూ ఓడిపోయిన అయ్యర్, ఇప్పుడు ఇంగ్లాండ్‌పై ఎలాగైనా గెలిచి తన లీడర్‌షిప్‌ను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గేకు ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చినప్పటికీ.. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతనిపై నమ్మకముంచి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

జట్టు వైస్ కెప్టెన్, సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు స్పిన్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ మరియు ప్రిన్స్ యాదవ్‌లు కొత్త బంతితో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయడానికి సిద్ధమవుతున్నారు. తిలక్ వర్మ, శివమ్ దూబేలు మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకోనున్నారు.

తొలి టి20 మ్యాచ్ కోసం భారత్ అంచనా ప్లేయింగ్ XI:

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, సూర్యాంశ్ శెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..