Reading Time: 2 minutes

Divya Suresh: బిగ్ బాస్ నటికి వీధుల్లో వేధింపులు.. రాత్రి వేళల్లో మహిళలకు సేఫ్టీ లేదంటూ పోస్ట్

Caption of Image.

కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ సీజన్ 8 మాజీ కంటెస్టెంట్ దివ్యా సురేష్ తనకు బెంగళూరులో రాత్రి వేళ వేధింపులు ఎదురైనట్లు ఆరోపించారు. ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో తాను, తన కజిన్ కలిసి కారువైపు వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి తమను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. అతడిని నిలదీశినా ఆగకుండా, కారులోకి ఎక్కే వరకు వెంటాడాడని పేర్కొన్నారు.

ఈ ఘటన గురించి దివ్యా సురేష్ (Divya Suresh) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వివరించారు. ‘‘ఈ రాత్రి నేను, నా కజిన్ కలిసి మా కారువైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి మమ్మల్ని వెంబడించడం ప్రారంభించాడు. మమ్మల్ని అనుసరిస్తూనే అతడు బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తించాడు. మేము వెంటనే అతడిని ప్రశ్నించినప్పటికీ అతడు ఆగలేదు. మేము కారులోకి ఎక్కే వరకు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాడు’’అని ఆమె పేర్కొన్నారు.

కేవలం రాత్రి సమయంలో బయట నడుస్తున్నందుకు ఏ మహిళ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని దివ్యా ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్టులో బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ, ‘‘మాకు పదేపదే హామీ ఇస్తున్న భద్రత ఎక్కడ ఉంది?’’ అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అయితే స్టోరీ గడువు ముగియడంతో ప్రస్తుతం ఆ వీడియో అందుబాటులో లేదు.

దివ్యా సురేష్ చేసిన ఈ ఆరోపణలతో, ముఖ్యంగా రాత్రి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు బెంగళూరు పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం!

దివ్యా సురేష్ 2021లో ప్రసారమైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 8 ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆమె నన్నా హెంద్తి ఎంబీబీఎస్, జోడి హక్కి వంటి సీరియళ్లతో పాటు పలు చిత్రాల్లో నటించారు. 2017లో మిస్ ఇండియా సౌత్ టైటిల్‌ను గెలుచుకున్న ఆమె అదే ఏడాది సినీ రంగ ప్రవేశం చేశారు. కాగా, 2025లో బెంగళూరులో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఆమె పేరు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

©️ VIL Media Pvt Ltd.