Reading Time: 2 minutes
Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!

Gold Loan Rules: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గోల్డ్ లోన్ నిబంధనలలో తీసుకువచ్చిన నూతన మార్పులు రుణగ్రహీతలకు శుభవార్తను అందజేస్తున్నాయి. ఇకపై, తమ వద్ద ఉన్న బంగారానికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం కల్పించింది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం చిన్న రుణగ్రహీతలకు అధిక క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తూనే, పెద్ద రుణాలకు తగిన భద్రతా చర్యలను కొనసాగించడం.

లోన్-టు-వాల్యూ (LTV) రేషియో అంటే ఏమిటి?

LTV (లోన్-టు-వాల్యూ రేషియో). అంటే మీ బంగారం విలువలో రుణదాత ఎంత శాతం మొత్తాన్ని రుణంగా అందించగలరో సూచించే నిష్పత్తి. LTV శాతం ఎక్కువ ఉంటే, అదే బంగారంపై మీరు ఎక్కువ రుణం పొందవచ్చని అర్థం. గతంలో చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లక్ష రూపాయల విలువైన బంగారంపై సాధారణంగా 75% LTV అంటే రూ. 75,000 వరకు మాత్రమే రుణం ఇచ్చేవి.

ఇది కూడా చదవండి: Gold Rates: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర..!

కొత్త LTV రేషియోలు, ప్రయోజనాలు:

ఆర్‌బీఐ సవరించిన మార్గదర్శకాల ప్రకారం, LTV రేషియోలను రుణం మొత్తాన్ని బట్టి వర్గీకరించింది:

  1. రూ.2.5 లక్షల వరకు రుణం: మీరు రూ. 2.5 లక్షల లోపు గోల్డ్ లోన్ తీసుకుంటున్నట్లయితే, LTV రేషియో 85% వరకు ఉంటుంది. ఉదాహరణకు రూ. 1,00,000 విలువైన బంగారంపై గతంలో రూ. 75,000 లోన్ లభించగా, ఇప్పుడు రూ. 85,000 వరకు రుణం పొందవచ్చు. ఇది చిన్న రుణగ్రహీతలకు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
  2. రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు రుణం: ఈ పరిధిలోని రుణాలకు 80% LTV రేషియో వర్తిస్తుంది. అంటే, మీ వద్ద రూ. 4,00,000 విలువైన బంగారం ఉంటే, మీరు రూ. 3,20,000 వరకు రుణం పొందవచ్చు.
  3. రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణం: రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకుంటున్నట్లయితే, LTV రేషియో 75%గా కొనసాగుతుంది. ఉదాహరణకు, రూ. 10,00,000 విలువైన బంగారంపై రూ. 7,50,000 వరకు రుణం పొందవచ్చు.

ఎవరికి వర్తిస్తుంది?

ఈ నూతన నిబంధనలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆర్‌బీఐ నియంత్రణలోని ఇతర అన్ని రుణదాతలకు వర్తిస్తాయి.

బంగారం విలువ ఎలా లెక్కిస్తారు:

బంగారం విలువ దాని స్వచ్ఛత, బరువు ఆధారంగా లెక్కిస్తారు. ఆభరణాలలో ఉండే రాళ్లు లేదా ఇతర అలంకరణ వస్తువులను రుణ మొత్తం లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరు.

చిన్న రుణాలకు సులభతర ప్రక్రియ:

నివేదికల ప్రకారం, రూ. 2.5 లక్షల వరకు చిన్న గోల్డ్ లోన్ల కోసం, రుణదాతలు వివరణాత్మక క్రెడిట్ లేదా ఆదాయ అంచనాను కోరకపోవచ్చు. ఇది రుణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.

తాకట్టు పెట్టిన బంగారం తిరిగి పొందే విధానం:

EY నివేదించిన ప్రకారం, రుణగ్రహీత రుణం చెల్లించిన తర్వాత 7 పని దినాలలోపు తాకట్టు పెట్టిన బంగారాన్ని రుణదాతలు తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది.

గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

పైన పేర్కొన్న LTV శాతాలు ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన గరిష్ట పరిమితులు మాత్రమే. రుణదాతల విధానాలు, బంగారం స్వచ్ఛత, అంచనా విలువ, వర్తించే ఛార్జీలు, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అసలు రుణ మొత్తం మారవచ్చు. అందుకే రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, తిరిగి చెల్లింపు నిబంధనలను పోల్చి చూసి, మీ అవసరాలకు తగిన రుణదాతను ఎంచుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: RBI: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. 6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ..!

ఇది కూడా చదవండి: Petrol Vehicles: ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి