Reading Time: < 1 minute
India Women Squad Asian Games 2026 Harmanpreet Kaur Captain

Asian Games 2026: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) నగరంలో జరగనున్న ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నారని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్-కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది.

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 లో భారత జట్టు గ్రూప్ స్టేజ్ లోనే (దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి) టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో.. 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీపై అనేక విమర్శలు వచ్చాయి. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు, ఈ టీ20 ప్రపంచకప్‌లో వ్యూహాత్మక లోపాలు, మైదానంలో చేసిన తప్పిదాల వల్ల ఘోరంగా విఫలమైంది. అయినప్పటికీ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆమెపైనే నమ్మకం ఉంచి ఆసియా క్రీడల సారథ్య బాధ్యతలను అప్పగించింది. మరోవైపు, భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (LA Olympics) కు అర్హత సాధించిన మరుసటి రోజే ఈ ఆసియా క్రీడల జట్టును ప్రకటించడం విశేషం. మడమ గాయం కారణంగా ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌కు దూరమైన యువ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో జరగనున్న ఈ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.

ఆసియా క్రీడలు 2026కి భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్-కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), రాధా యాదవ్, నందిని శర్మ.