
SL A vs Ind A: శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా-A బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో అదరగొట్టాడు. దంబుల్లాలో శ్రీలంక-Aతో జరిగిన మ్యాచ్‌లో తన లిస్ట్-A కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడిన గైక్వాడ్, ఈ ప్రత్యేక మ్యాచ్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చుకుంటూ సెంచరీ సాధించాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా అవుట్ కావడంతో జట్టు కేవలం 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ప్రియాంశ్ ఆర్యా (32) కొంతసేపు నిలకడగా ఆడినా మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి నాలుగో వికెట్‌కు 150 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. వీరిద్దరూ శ్రీలంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ భారీ స్కోరుకు పునాది వేశారు.
రుతురాజ్ గైక్వాడ్ 113 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 112 బంతుల్లో శతకం పూర్తి చేసిన గైక్వాడ్‌కు ఇది లిస్ట్-A కెరీర్‌లో అతనికి ఇది 21వ సెంచరీ. అలాగే 100వ లిస్ట్-ఏ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసి ప్రత్యేకంగా నిలిచాడు. ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ కూడా 97 బంతుల్లో 60 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఆయుష్ బదోని (24), సూర్యాంశ్ షెడ్గే (26 నాటౌట్) వేగంగా పరుగులు జోడించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
మొదటగా ఈ పర్యటనకు ఎంపిక కాని రుతురాజ్ గైక్వాడ్‌కు రియాన్ పరాగ్ గాయం కారణంగా చివరి నిమిషంలో అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు తొలి మ్యాచ్‌లోనే శతకంతో తన సత్తా చాటాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకుని, భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శ్రీలంక బౌలింగ్ లో మహ్మద్ షిరాజ్ 9 ఓవర్లలో 67 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నే (1/46), గరుక సంకేత్ (1/49), వనుజ సహన్ (1/35) తలో వికెట్ సాధించారు. అయితే ఈ మ్యాచ్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ మాత్రం 14 పరుగులకే అవుట్ కావడంతో అభిమానులను నిరాశపరిచాడు.
Innings Break!
India A put up a strong total of 277/6 after 50 overs
Vice-captain Ruturaj Gaikwad’s 1⃣0⃣1⃣(114) and Captain Tilak Varma’s 6⃣0⃣(97) led the charge
Scorecard
https://t.co/nwKDTkg1ZY#TriNationSeries | #SLAvINDA pic.twitter.com/ceqxYs0XEC
— BCCI (@BCCI) June 9, 2026

