Reading Time: < 1 minute
Vaibhav Sooryavanshi For Team India Steve Finn Urges Early Selection After Ipl 2026 Heroics

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తన తొలి పూర్తి సీజన్ ఆడిన వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ దూకుడు, నిలకడైన ప్రదర్శనలు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ల ప్రశంసలను కూడా అందుకుంటున్నాయి.

వైభవ్ ప్రదర్శనపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ ఫిన్ స్పందించారు. అతడిని వీలైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకురావాలని అభిప్రాయ వ్యక్తం చేశాడు. యూకే వేసవి సీజన్‌ లోనే భారత జెర్సీలో వైభవ్‌ను చూడాలని తనకు ఉందని ఫిన్ పేర్కొన్నాడు. “భారత్ ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ జట్టు. ఓపెనింగ్‌లో ఇప్పటికే అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లు ఉన్నారు. అందువల్ల ఎవరిని పక్కనబెట్టి వైభవ్‌కు అవకాశం ఇవ్వాలన్నది కఠిన నిర్ణయమే. అయితే అతడు జట్టులోకి వస్తే టీమిండియా మరింత బలపడుతుంది” అని ఫిన్ వ్యాఖ్యానించాడు.

ఈ సీజన్‌కు ముందు వైభవ్ మరోసారి అదే స్థాయిలో నిలకడగా రాణించగలడా అనే సందేహాలు ఉన్నాయని ఫిన్ పేర్కొన్నాడు. అయితే వాటన్నింటికీ యువ బ్యాటర్ తన ఆటతో సమాధానం ఇచ్చాడని కొనియాడాడు. “ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ 700కు పైగా పరుగులు చేసి 236 స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం అసాధారణ విషయం. అదీ కేవలం 15 ఏళ్ల వయసులో పూర్తి సీజన్ అంతా అదే దూకుడు కొనసాగించడం నమ్మశక్యం కాని విషయం. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో వైభవ్‌నే అతిపెద్ద కథనం” అని ఫిన్ ప్రశంసించాడు.

వైభవ్ ఆటలో యార్కర్ బంతులను ఎదుర్కోవడమే ఒక చిన్న బలహీనతగా కొందరు పేర్కొంటున్నారని ఫిన్ చెప్పాడు. అయితే కొత్త బంతితో కచ్చితమైన యార్కర్లు వేయడం బౌలర్లకే చాలా కష్టమని, అలాంటి చిన్న లోపం మాత్రమే ఉంటే దానిని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ కు గాను 5 కీలక అవార్డ్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు రూ.45 లక్షల రివార్డ్స్ ను కూడా గెలుచుకున్నాడు.