Reading Time: < 1 minute
Karnataka Cm Change Rumours Congress High Command Dk Shivakumar Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హస్తినలో మకాం వేయడంతో ఈసారి ముఖ్యమంత్రి మార్పు ఖాయమని వార్తలు వచ్చాయి. అంతే విధంగా మంగళవారం ఉదయం నుంచి కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఇక రాహుల్ గాంధీ అయితే రహస్య చర్చలు కూడా జరిపారు. దీంతో ఈసారి డీకే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించవచ్చని జాతీయ మీడియా జోరుగా వార్తలు ప్రచారం చేశాయి. ప్రియాంకాగాంధీ కూడా డీకే.శివకుమార్‌కు మద్దతు తెలిపినట్లుగా ప్రచారం జరిగింది. కానీ 6 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత కేసీ.వేణుగోపాల్ తూచ్.. అదేమీ కాదంటూ కొట్టిపారేశారు. దీంతో డీకే అనుచరుల్లో నీళ్లు చల్లినట్లైంది.

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలను కేసీ.వేణుగోపాల్ కొట్టిపారేశారు. మంగళవారం జరిగిన చర్చలు కేవలం రాజ్యసభ ఎన్నికల కోసమేనని తేల్చి చెప్పారు. రాబోయే రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలపై మాత్రమే చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వ మార్పు జరుగుతోందన్న వదంతులను తోసిపుచ్చారు. “ఈరోజు చర్చ కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూనే జరిగింది. మీరు ఊహించినదేదీ నిజం కాదు” అని అన్నారు. ‘‘మేము ఒక సమావేశం నిర్వహించాం. సీఎం, డీప్యూటీ సీఎం, రణదీప్ హాజరయ్యారు. ఈరోజు చర్చ మొత్తం రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లపైనే కేంద్రీకృతమైంది. ఊహాగానాలు ఆపండి.’’ అని వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ కర్ణాటక ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా, సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.

2023లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఖాయమని ఆయన మద్దతుదారులు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం కర్ణాటక నాయకత్వ సమీకరణంపై కొత్త ఊహాగానాలకు దారితీసింది. అయితే సమావేశం అనంతరం అదేమీ కాదని తేల్చేశారు.