Reading Time: < 1 minute
Ipl 2026 Mi Vs Rr Mumbai Indians Eliminated Hardik Pandya

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) 30 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే మ్యాచ్ చేజారిందని ఆయన స్పష్టం చేశాడు.

మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “ఈ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మేము బౌలింగ్‌లో మరో 10-15 పరుగులు అదనంగా ఇచ్చేసామని భావిస్తున్నాను. అయినప్పటికీ 206 పరుగుల లక్ష్యం ఈ వికెట్‌పై ఛేదించదగినదే. కానీ, మా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే పవర్‌ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం మా కొంపముంచింది. అక్కడి నుంచి మ్యాచ్‌ను తిరిగి మా వైపు తిప్పడం ఎప్పుడూ కష్టంతో కూడుకున్న పనే. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పిచ్ చాలా బాగుంది, బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తోంది. సరైన షాట్లు ఆడి క్రీజులో నిలబడి ఉంటే బాగుండేది” అని తెలిపాడు.

డెత్ ఓవర్ల బౌలింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. “చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే. అయితే చివరి 5 ఓవర్లలో 1 లేదా 2 బౌండరీలను ఆపగలిగితే ప్రత్యర్థి స్కోరును కట్టడి చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మేము ఆ పని చేయలేకపోయాము. రాజస్థాన్ జట్టు చివరి 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు రాబట్టడం మా ఓటమికి ప్రధాన కారణం” అని పాండ్యా వివరించాడు. ఈ సీజన్ మాకు అస్సలు కలిసి రాలేదు.. వచ్చే ఏడాది చూసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (0), నమన్ ధీర్ (6) రూపంలో పవర్‌ప్లేలోనే ఆర్చర్ ముంబయికి కోలుకోలేని దెబ్బకొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (60) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, హార్దిక్ పాండ్యా (34) అవుట్ కావడంతో ముంబయి ఇన్నింగ్స్ 175 పరుగులకే పరిమితమైంది. ఒత్తిడిని తట్టుకోవడంలో ముంబయి ఆటగాళ్లు విఫలమయ్యారని క్రికెట్ నిపుణులు విమర్శిస్తున్నారు.