Reading Time: < 1 minute
Kolkata Airport Mosque Relocation Controversy

Kolkata Airport Mosque: కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్‌వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ పాలకుడు మాత్రం ఓట్ల వేటలో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ మసీదుపై మరోసారి చర్చ మొదలైంది.

‘‘గౌరీపసూర్ జామే మస్జిద్’’ లేదా ‘‘బంక్రా మసీదు’’గా పిలిచే ఈ మసీదు ఏయిర్‌పోర్టు రన్ వే పక్కనే ఉంది. దీంతో ఇది భద్రతా పరమైన ఆందోళనల్ని పెంచుతోంది. ఎయిర్ పోర్ట్ ఆపరేషనల్ జోన్‌లోనే ఈ మసీదు ఉంది. సెకండ్ రన్‌వేకు కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. నియమాల ప్రకారం కనీసం 240 మీటర్ల దూరంలో ఉండాలి. దీని కారణంగా విమానాలు దిగే టచ్ డౌన్ పాయింట్‌ను 88 మీటర్లకు మార్చాలి వచ్చింది. పెద్ద విమానాలు ల్యాండ్ కావాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో పాలన చేపట్టిన ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఈ మసీదు జోలికి వెళ్లలేదు. సీపీఎం ప్రభుత్వం ఉన్న సమయంలో జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్జి, టీఎంసీ ప్రభుత్వ సమయంలో సీఎం మమతా బెనర్జీలు ఈ మసీదును తరలించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయితే, ప్రస్తుతం సీఎం సువేందు అధికారి ఉండటంతో ఈ ప్రార్థనా మందిరం మార్పు తప్పక ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా(ఏఏఐ) అధికారులు మసీదు వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం మసీదు కమిటీ సభ్యులతో మసీదు తరలింపుపై చర్చించారు.

మే 28 బక్రీద్ వరకు మసీదు తరలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని జిల్లా అధికారులు, ఎయిర్ పోర్టు అధికారులు నిర్ణయించారు. ఈద్ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం రోజుకు 10 నుంచి 25 మంది వరకు నమాజ్ చేసుకునేందుకు ఆ మసీదుకు వెళ్తున్నారు. శుక్రవారం రోజు ఈ సంఖ్య 80కి చేరుతుంది. సీఐఎస్ఎఫ్ కఠినమైన భద్రతా తనిఖీలు, ఐడీ కార్డ్ చెక్ చేసిన తర్వాతనే ప్రార్థన చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.