Reading Time: < 1 minute
Supreme Court Orders Mandatory Kidnap Fir For Missing Children Cases

దేశవ్యాప్తంగా పిల్లల మిస్సింగ్ కేసులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇకపై పిల్లల మిస్సింగ్‌పై కిడ్నాప్ ఎఫ్‌ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో 2011 నుంచి కనిపించకుండా పోయిన ఒక చిన్నారి కేసును విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా ఎవరైనా వ్యక్తి లేదా చిన్నారి కనిపించకుండా పోయిన ప్రతి కేసులో కిడ్నాప్ కేసు నమోదు చేయడం అన్ని పోలీస్ స్టేషన్లకు తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల అక్రమ రవాణా, ఏళ్ల తరబడి ఆచూకీ లభించని పిల్లల సమస్యను అత్యంత గంభీరంగా పరిగణిస్తూ పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని న్యాయస్థానం పేర్కొంది.

దేశంలో సుమారు 47 వేల మంది పిల్లలు ఇప్పటికీ ఆచూకీ లేకుండా ఉన్నారనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ‘‘ఏ వ్యక్తి లేదా చిన్నారి కనిపించకుండా పోయిన సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయకూడదు. బాధిత కుటుంబ సభ్యులపై వెతికే బాధ్యతను మోపకూడదు.’’ అని స్పష్టం చేసింది.

అంతేకాకుండా నమోదయ్యే ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కిడ్నాప్‌కు సంబంధించిన సెక్షన్లు తప్పనిసరిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది ఎంతో పెద్ద సమస్య. కానీ దీని తీవ్రతను ఎవరూ గుర్తించడం లేదు. ప్రజలు ఈ విషయంలో దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని చూసీ చూడనట్టుగా ఎలా ఉండగలం?.’’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.