
వాహనదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచారు. పెట్రోల్ ధరను లీటరుకు 87 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 91 పైసలు పెంచారు. గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడవసారి. అంతకుముందు, మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 చొప్పున పెంచారు. ఆ తర్వాత, మే 19న పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ లోని సామాన్యుడిపై ద్రవ్యోల్బణం భారం పెరుగుతూనే ఉంది. ఈ విధంగా, గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సుమారుగా రూ.5 మేర పెరిగాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.98.64 నుంచి రూ.99.51 కు, అంటే 87 పైసలు పెరిగాయి. అదే సమయంలో డీజిల్ ధరలు లీటరుకు రూ.91.58 నుంచి రూ.92.49 కు, అంటే 91 పైసలు పెరిగాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్న వేళ దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.