Reading Time: < 1 minute
Machilipatnam Commerce Lecturer Accused Of Misusing Job Promise To Trap Young Woman

Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ ” కామలీలల” వహారం కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి ఓ నిరుద్యోగ యువతిని లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో ప్రస్తుతం లెక్చరర్‌గా పనిచేస్తున్న జాషువా.. గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో పనిచేసినట్లు సమాచారం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి పరిస్థితిని అదునుగా చేసుకుని, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మచిలీపట్నం గొడుగు పేట ప్రాంతంలోని ఓ దేవాలయం సమీపంలో అద్దె ఇంటిని తీసుకుని అక్కడికి యువతిని రావాలని పిలిచాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న జాషువా భార్య అక్కడికి చేరుకుని భర్త దురాగతాన్ని అడ్డుకుంది. హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యుల సహకారంతో బాధిత యువతికి అండగా నిలిచి, ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, అదే కారణంగా జాషువా మచిలీపట్నంలో వేరుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడని తెలిసింది. మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి, వారిని తన వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై జాషువా భార్య మాట్లాడుతూ.. తమ వివాహం జరిగి 25 సంవత్సరాలు అయ్యిందని, గత కొంతకాలంగా ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ తనతో గొడవలకు దిగుతున్నాడని ఆరోపించారు. గతంలో కూడా పలువురు యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, రాజకీయ నాయకుల అండదండలతో రాజీలు చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుగుతోంది.