Reading Time: 1 minute
Ladakh Heavy Snowfall Amid Extreme Heatwave India Zojila Pass Videos Viral

దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం దేశంలో ఆయా ప్రాంతాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంతటి భయంకరమైన పరిస్థితులు దేశంలో ఉంటే.. లడఖ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. లడఖ్‌లో ప్రస్తుతం భారీ హిమపాతం కురుస్తోంది. దీంతో వాతావరణం ఆహ్లాదరకరంగా మారింది. ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు.

లడఖ్‌లోని జోజిలా కనుమ చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. కార్గిల్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలోని పర్వతాలు మంచు దుప్పటితో కప్పబడి ఉన్నాయి. అసలు వేడి జాడే లేదు. పార్క్ చేసిన వాహనాలు మంచు పొరతో కప్పుకున్నాయి. మరోవైపు మైదాన ప్రాంతాల్లో మండుతున్న ఎండలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో అయితే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. హీట్ భరించలేక బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లడఖ్‌లో కురుస్తున్న భారీ హిమపాతంతో అక్కడ ప్రజలు సేదతీరుతున్నారు. ఇక భారీ హిమపాతం కారణంగా ప్రధాన రహదారిలో రాకపోకలకు నిలిపివేశారు. లడఖ్‌ను కాశ్మీర్ లోయతో కలిపే ఏకైక మార్గం ఇదే. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాబోయే ఏడు రోజుల పాటు ఢిల్లీలో వడగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాజధానిలో రాబోయే ఏడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే వారం పాటు హర్యానా, పంజాబ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.