Reading Time: 2 minutes
Pm Modi Receives Fao Agricola Medal 2026 Highest Honour In Italy

ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అరుదైన గౌరవం దక్కింది. మోడీకి ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) అత్యున్నత గౌరవమైన ‘అగ్రికోలా మెడల్ 2026’ తో సత్కరించింది. ఇటలీ రాజధాని రోమ్‌లోని FAO ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో FAO డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డాంగ్యూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రధాని మోడీకి అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ క్యూ డాంగ్యూ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం మోడీ చేసిన కృషికి గుర్తింపుగానే ఈ అవార్డును అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ఆహార భద్రత బలోపేతం, రైతుల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం అమలు చేసిన పలు కీలక పథకాలను ప్రశంసించారు. అలాగే ఆకలి, పేదరిక నిర్మూలన, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత సాధనలో FAO లక్ష్యాలకు భారత్ అందిస్తున్న మద్దతును కొనియాడారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మోడీ చేస్తున్న కృషిని కూడా FAO డీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా భారత జీ20 అధ్యక్షత్వ కాలంలో వ్యవసాయాన్ని అంతర్జాతీయ అజెండాలో కీలక అంశంగా నిలిపిన విధానాన్ని అభినందించారు.

భారత వ్యవసాయ రంగంలో రైతు కేంద్రిత సంస్కరణలు, వినూత్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా మోడీ చూపిన నాయకత్వాన్ని FAO ప్రశంసించింది. మోడీ నాయకత్వంలో అమలైన భారీ ఆహార భద్రత పథకాలు, కోట్లాది రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం, సహజ వ్యవసాయం ప్రోత్సాహం, చిరుధాన్యాల ప్రాచుర్యం వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొంది.

కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం కింద 80 కోట్ల మందికి ఆహార సహాయం అందించిన విషయాన్ని FAO ప్రత్యేకంగా గుర్తించింది. అలాగే 11 కోట్లకు పైగా రైతులకు నేరుగా ఆదాయ మద్దతు అందించడం, మిల్లెట్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం వంటి చర్యలను ప్రశంసించింది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రపంచ ప్రజా వనరుగా మోడీ ప్రతిపాదించిన అంశాన్ని కూడా FAO కొనియాడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిజిటల్ సాంకేతికతల ద్వారా సేవల అందుబాటును పెంచడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. ఈ చర్యల వల్ల కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడగలిగారని FAO అభిప్రాయపడింది.

మోడీ స్వాగతం..
అగ్రికోలా మెడల్‌ పతకం అందుకున్న తర్వాత మోడీ మాట్లాడుతూ. ‘‘మా అద్భుతమైన స్వాగతానికి, నాకు అగ్రికోలా పతకంతో గౌరవించినందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) డైరెక్టర్‌కు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశం పట్ల ఆయన స్నేహపూర్వక మాటలకు, FAOకు ఆయన చేసిన సంవత్సరాల సేవలకు నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే కాకుండా భారతదేశంలోని కోట్లాది మంది రైతులకు, పశుపోషకులకు, మత్స్య పెంపకందారులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, మన కార్మికులకు లభించిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధిని కేంద్రంగా చేసుకున్న భారతదేశ నిబద్ధతకు కూడా ఇది ఒక గౌరవం. నేను ఈ పతకాన్ని అత్యంత వినయంతో స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతకు అంకితం చేస్తున్నాను..’’ అని మోడీ తెలిపారు.